సినిమాలు త్యాగం చేసి, కోట్ల ఆదాయం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చా మీకోసం అంటూ తెగ బాధపడిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒట్టు తీసి గట్టున పెట్టారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చేసారు. పైగా తిరిగి ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. తనను ఎవరో సినిమాలు చేయవద్దని అడ్డం పడినట్లు, ఆయనకు ఆయనే ఫీల్ అయిపోయి, తాను సినిమాలు చేయడం తప్పా? అంటూ తాను వేసిన రివర్స్ గేర్ ను సమర్థించుకోవడం ప్రారంభించారు.
సరే, ఎలాగూ సినిమాలు చేయడం ప్రారంభించారు, సినిమాకు యాభై కోట్ల వంతున మూడు సినిమాలు చేయబోతున్నారని ఇప్పటికే బలమైన గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అంటే 150 కోట్ల ఆదాయం. ఇప్పుడు ఆయన చేయాల్సిన తొలి పని ఒకటి వుంది. ఆయనను నమ్ముకుని, అమెరికా నుంచి వచ్చి , జనసేన కోసం సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమం చేసిన కంపెనీ ఒకటి వుంది.
ఆ కంపెనీ జనసేన-పవన్ కోసం ఓ పెద్ద ఆఫీసు తీసి, భారీగా నియామకాలు చేసి, కొన్నాళ్లు విపరీతంగా వర్క్ చేసింది. కానీ ఈ రేంజ్ పెట్టబడి తమ వల్ల కాదు అని, గ్రహించి ఇక ఆగిపోయింది. కానీ ఆ బిల్లు సుమారు అయిదు కోట్లు డిటైల్డ్ గా పవన్ కు సమర్పించినట్లు బోగట్టా. ఇలా సమర్పించి చాలా నెలలు అయింది. కానీ ఇప్పటి వరకు కనీసం జనసేన నుంచి కానీ, పవన్ నుంచి కానీ అస్సలు సమాధానం రాలేదని తెలుస్తోంది.
అయితే పెద్దవాళ్లతో వ్యవహారం, ముళ్ల కంచె మీద ఆరేసిన పంచెను స్మూత్ గా వెనక్కు తీసుకోవాలి అని సామెత. అందుకే సదరు సంస్థ, దాని అధినేత అలా మౌనంగా వేచి వున్నారు. ఎప్పటికైనా పెట్టిన పెట్టుబడి అయిదు కోట్లు జనసేన నుంచి రాకపోతాయా అని.
పవన్ కు ఇప్పుడు నూట యాభై కోట్ల ఆదాయం రాబోతోంది కనుక, తీర్చేస్తారని ఆశిద్దాం.