జీవీఎల్ నరసింహారావు…బీజేపీ దక్షిణ భారతదేశ అధికార ప్రతినిధి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా నివాసి. సుదీర్ఘకాలంగా ఢిల్లీలో ఉంటూ బీజేపీ వ్యవహారాలను చూస్తుండటం వల్ల ఆయన మాట్లాడే తెలుగు కొంత విభిన్నంగా ఉంటుంది. జీవీఎల్ గురించి తెలుగు సమాజానికి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గత రెండేళ్లుగా మాత్రమే బాగా తెలుసు.
అది కూడా ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్న వార్‌లో జీవీఎల్ గట్టిగా నిలబడ్డాడు. ఒక చానల్ చర్చా కార్యక్రమంలో అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, జీవీఎల్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. జీవీఎల్‌ను ‘రేయ్’ అంటూ రమేష్ దూషణలకు కూడా దిగాడు. ఇప్పుడవన్నీ గతం.
వర్తమానంలోకి వస్తే ఏపీలో అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని జగన్ సర్కార్ 50 రోజుల క్రితం నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చాయి. అలాగే బీజేపీకే చెందిన సుజనాచౌదరి మరింత దూకుడుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ‘ఒక్క అంగుళం కూడా కదిలించలేరని, కేంద్రం చూస్తూ ఊరుకోదు’ అని జగన్ సర్కార్‌ను హెచ్చరించాడు.
సరిగ్గా ఇదే సమయంలో జీవీఎల్ ‘నేనున్నా’ అంటూ రాజధాని రంగంలోకి దిగాడు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చి చెప్పాడు. అంతేకాదు తాను చెప్పిందే కేంద్రం మాట అని కూడా మరోమాటకు తావులేకుండా చేశాడు. ఒకవైపు బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సుజనాచౌదరి, ఇటీవల ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్‌కల్యాణ్ హెచ్చరికల నేపథ్యంలో జగన్ సర్కార్‌కు జీవీఎల్ పరోక్షంగా గట్టి మద్దతుదారుడిగా నిలిచాడు.
కేంద్రం పెద్దన్నగా వ్యవహరించాలనే టీడీపీ మాటలకు…మోడీ సర్కార్ పెద్దన్న పాత్ర పోషిస్తే, ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఘాటుగా జవాబిచ్చాడు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఛీప్ ట్రిక్స్‌గా ఆయన అభివర్ణించాడు.
నిన్న లోక్‌సభలో ఏపీలో రాజధాని విషయమై కేంద్రహోంశాఖ స్పష్టమైన లిఖిత పూర్వక ప్రకటన చేసింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, దాంట్లో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇదే సందర్భంలో గత టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని కూడా కేంద్రం ప్రకటించింది. దీన్ని సాకుగా తీసుకుని టీడీపీ ఏదో చేయాలని ప్రయత్నించింది.
ఇప్పుడు కూడా జీవీఎల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చి టీడీపీ వాదనను బలంగా తిప్పి కొట్టాడు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ టీడీపీ ఇచ్చిన జీఓ అక్బర్ చక్రవర్తి జారీ చేసిన శిలాశాసనం కాదని ఘాటుగా గడ్డి పెట్టాడు. చంద్రబాబు తెచ్చిన జీవోలు మార్పునకు వీలు కాదన్నట్టు టీడీపీ నేతలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికాడు. ఇప్పుడు జగన్ సర్కార్ రాజధాని విషయమై జీఓ ఇస్తే…దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పాడు.
రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని.. కేంద్రం పార్లమెంట్‌లో తేల్చి చెప్పిందని జీవీఎల్ నరసింహారావు బుధవారం మరోసారి స్పష్టం చేశాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని తాను ఎప్పుడో చెప్పానన్నాడు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. విపక్షాలు వితండవాదం చేస్తున్నాయని మండిపడ్డాడు.
రైతుల్ని మభ్యపెట్టాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్ ఆరోపించాడు. రాజధానిని మారుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే…కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని మరోసారి ఆయన బలమైన వాదన వినిపించి టీడీపీతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించేందుకు యత్నించాడు. అమరావతిని కొనసాగించాలని చెప్పడానికి.. జగన్‌ను మోదీ నియమించలేదని, ప్రజలు ఎన్నుకున్నారని జీవీఎల్ ఘాటైన పదజాలంతో ప్రతిపక్షాలకు సమాధానమిచ్చాడు.
ఇలా ప్రతి సందర్భంలో జీవీఎల్ ముందుకొచ్చి చెబుతున్న విషయాలు జగన్ సర్కార్‌కు గొప్ప భరోసా ఇస్తున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా రాష్ట్ర సర్కార్ వాదనను బలంగా వినిపించే నాయకులు వైసీపీలో కొరవడ్డారు. ఒక రకంగా వైసీపీ వాదనను జీవీఎల్ నెత్తినెత్తుకున్నాడనే వాళ్లు లేకపోలేదు. మరోవైపు బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సుజనాచౌదరి, పురంధేశ్వరి తదితరులు అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ప్రకటిస్తుండటంతో….రాష్ట్ర ప్రజలకు ఎక్కడో ఏ మూలనో అనుమానం ఉండింది.
తాజాగా జీవీఎల్ తన వాగ్దాటి, విషయ పరిజ్ఞానం, అన్నిటికి మించి కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి ఏపీలో ఎప్పటికప్పుడు రాజధాని విషయమై స్పష్టత ఇస్తూ వస్తున్నాడు. దీనివల్ల ఒక వైపు జగన్ సర్కార్‌కు నైతికంగా, చట్టబద్ధంగా బలం ఇస్తుండటంతో పాటు కేంద్రాన్ని తప్పు పట్టే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్టైంది. మొత్తానికి ఓ కీలక దశలో జీవీఎల్ లేకపోతే జగన్ సర్కార్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలగక మానదు.
గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు