మొన్ననే చెప్పాడు.. “దేన్నీ తెగేవరకూ లాగవద్దు..'' అని, అయితే అందరికీ అలాంటి హితబోధ చేసిన జనసేన అధినేత తను మాత్రం ఆ నీతిని అర్థం చేసుకోవడం లేన్నట్టుగా ఉంది. ఆయన తెగే వరకూ లాగుతున్నాడేమో అనిపిస్తోంది. పవన్ ట్వీట్లే ఈ అబిప్రాయానికి కారణం అవుతున్నాయి. తెలుగుదేశం ఎంపీలపై మొదట విమర్శలు చేసిన పవన్ కు వాళ్లు గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే పవన్ మళ్లీ వాళ్లకు సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు… వాళ్లతో వాదనకు దిగుతున్నట్టుగా ట్వీట్లు పెడుతున్న జనసేనాని. దీంతో ఆయన ఇప్పుడు తెగే వరకూ లాగుతున్నాడేమో అనిపిస్తోంది.
చాన్నాళ్ల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత ఆ రోజున తెలుగుదేశం ఎంపీలను లక్ష్యంగా చేసుకొన్నాడు. ఎంపీలు వ్యాపారాలు మీద పెట్టినంత శ్రద్ధ ప్రజాసమస్యల మీద పెట్టడం లేదని పవన్ విమర్శలు చేశాడు. దీనికి ప్రతిగా తెలుగుదేశం ఎంపీలు రెచ్చిపోయారు. తమను పవన్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించలేని వాళ్లు జనసేనానికి ఘాటుగానే సమాధానం చెప్పారు. ముందు మీ ఇంట్లో ఉన్న ఎంపీని ప్రశ్నించు.. అని వారు దెప్పి పొడిచారు.
మరి అంతటితో ఆగి ఉంటే బావుండేది.. అయితే పవన్ మళ్లీ ట్వీటాడు. తెలుగుదేశం ఎంపీలను లక్ష్యంగా చేసుకొన్నాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో కేవలం ఆరు మందే పాల్గొన్నారు.. మిగతా వారు అంతా ఏమయ్యారు? అని పవన్ తనదైన రీతిలో ప్రశ్నించాడు. మరి ఎప్పుడో మార్చిలో జరిగిన చర్చ విషయంలో పవన్ ఆ రోజున ప్రశ్నించలేదు! ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదేదో వాదించడానికి ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది కానీ… మరోటి కాదు.
ఒకవేళ పవన్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగిన మరుసటి రోజే ఈ ట్వీటు పెట్టి ఉంటే..అది టైమ్లీగా ఉండేది. అయితే బహుశా జనసేనానికి ఆ రోజున తీరిక లేకపోయిందేమో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలపై ఎదురుదాడి చేయడానికి.. మార్చిలో జరిగిపోయిన అంశం గురించి ఇప్పుడు స్పందించాడు. మరి ఇప్పుడు పవన్ ను తెలుగుదేశం ఎంపీలు ఇంతటితో వదలకపోవచ్చు. వాళ్లు మళ్లీ ఏదో ఒక మాటతో పవన్ ను కెలికే అవకాశాలే ఎక్కువ. మరి పవన్ మళ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి!