బాహుబలి సినిమా క్రేజీనెస్ కు ఇది పరాకష్ట. అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ఈ భారీ సినిమా తెలుగునాట తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. అనేక రంగాల ప్రజానీకం ఈ సినిమా పట్ల ఎనలేని ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ ఆసక్తి పరకాష్టకు చేరడం కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. విడుదలకు రెండు రోజుల ముందే థియేటర్ల వద్ద భారీ క్యూలు.. అక్కడ జరిగిన తోపులాటలే దీనికి సాక్ష్యం.
మరి ఇంతే కాదు.. ఇప్పుడు బాహుబలి ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సెలవులిచ్చేంత స్థాయి బలాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీ, తెలంగాణల్లోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు నేడు అప్రకటిత సెలవు. స్టూడెంట్లు అంతా సినిమా మీద పడిపోవడంతో కాలేజీలు వెలవెలబోతున్నాయి. క్లాసులకు హాజరయ్యే నాథుడు లేకపోవడంతో.. రెండు రోజుల నుంచి శుక్రవారాన్ని సెలవుగా ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది. అయితే సినిమా కోసం సెలవు ఇచ్చామనే చెడ్డపేరును భరించలేక కాలేజీ యాజమాన్యాలు అధికారిక సెలవును అయితే ప్రకటించలేదు.
కానీ అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా థియేటర్ల బాట పట్టడంతో.. ఇది అప్రకటిత సెలవు అయ్యింది. ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్లలో ఈ రోజుల కాలేజీకి వెళ్లిన వారే పాపాత్ములు అన్నట్టుగా మారింది పరిస్థితి!