జవాబులు – ఎమర్జన్సీ రామాయణంలో నా కులం గురించి, కులాభిమానం (!?) గురించి, చంద్రబాబు పాలన గురించిన పిడకలవేట రావడం ఏమీ బాగా లేదు. నేను శ్రద్ధాసక్తులతో సీరీస్ రాస్తున్నపుడు దానిలో ప్రస్తావించిన వ్యక్తుల గురించి సందేహాలుంటే తీర్చుకోవచ్చు, తప్పులుంటే ఎత్తిచూపవచ్చు. నా గోల ఏల? 2) సోషలిస్టు ఉద్యమం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నడిచింది అని నేను రాయలేదు, సోషలిజం ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినది, లోహియా మాత్రమే కులాన్ని ముందుకు తెచ్చాడు. అందుకే లోహియా మార్కు సోషలిజం (!) గురించి వ్యాఖ్యలు చేశాను. అదీ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా.. అనే రాశాను, తప్ప బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అని రాయలేదు 3) లోహియాయే కాదు, ఆయన అనుచరుల్లో చాలామంది అగ్రవర్ణస్తులే. ఇందిర, ఆమెకు వ్యతిరేకంగా పోరాడిన మొరార్జీ, వాజపేయి, రాజ్ నారాయణ్ అందరూ బ్రాహ్మణులే. అప్పట్లో అన్ని పార్టీల అగ్రనాయకుల్లో బ్రాహ్మణులు బహుళంగా వుండేవారు. 4) ఇందిర స్త్రీ కాబట్టి దింపేయాలనుకున్నా రనుకోవడం సరికాదు. మొగవాళ్ల మీద మొగవాళ్లు పగబట్టరా? రాజకీయాలను స్వార్థమే నడిపిస్తుంది. కులం, ప్రాంతం, ఆడామగా తేడా – బలం కూడగట్టుకోవడానికి పనికి వచ్చే సాధనాలంతే 5) కేరళలో బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం నడవలేదు. తమిళనాడులోనే నడిచింది. ''తమిళ రాజకీయాలు'' సీరియల్‌లో విపులంగా రాశాను. తెలుగునాట బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం రెండు జిల్లాల్లో పుట్టి చాలా చప్పున చల్లారిపోయింది. 6) నా ఆర్టికల్‌ను వెబ్‌సైట్ వాళ్లు తొలగించివేశారన్నది నాకు తెలిసున్నంత వరకు సర్వాబద్ధం. నాకు యిక్కడ పరిపూర్ణ స్వేచ్ఛ వుందని పదేపదే రాశాను. అభాండం వేసిన పాఠకుడే దాన్ని నిరూపించాలి. 7) సుబ్రహ్మణ్యస్వామి వాజపేయి గురించి మాట్లాడిన విషయాలపై జనతా పార్టీ పాలనపై సీరీస్ రాసినప్పుడు (ఎప్పుడో తెలియదు) రాస్తాను. ఇప్పుడు అప్రస్తుతం. 8) జస్టిస్ సిన్హాపై విమర్శలు చేసేముందు చట్టం అలా వుందనే విషయం పాఠకులు గుర్తించాలి.
అనేక సాహసనిర్ణయాలు గతంలో తీసుకున్న తల్లి యిప్పుడు మానసికంగా కృంగిపోయిందని సంజయ్ గమనించాడు. తను తయారుచేద్దామనుకుంటున్న కారుకి పెట్టుకున్న పేరు 'మారుతి' కథ గుర్తుకు వచ్చింది. సముద్రం లంఘించగలనా లేదా అని సందిగ్ధంలో పడినప్పుడు జాంబవంతుడు యితర వానరుల చేత హనుమంతుణ్ని కీర్తింపచేశాడు. హనుమంతుడికి తన బలం తెలిసి వచ్చింది. ఇప్పుడు కావలసినదీ అదే! వా-నరమూకలను ఏర్పాటు చేసి, ఇందిర వద్ద భజన చేయించాలి. అప్పుడు 'ఇంతమంది నా వెంట వుండగా నేనేదైనా చేయగలను' అనే తెగింపు ఆమెకు వస్తుంది. నాయకత్వం వహించేవారికి కావలసినది తమపై తమకు అచంచలమైన విశ్వాసం. అది వారి ప్రసంగాల్లో ప్రతిఫలిస్తే అనుయాయులు వారి మాటల మాయలో పడతారు. ఆత్మవిమర్శతో, సందేహాలతో కొట్టుమిట్టులాడే వారు పాప్యులర్ నాయకులు కాలేరు.
సంజయ్ గాంధీ అంటే లోకంలో ఎవరికీ గౌరవం లేకపోవచ్చు. అతను డెహ్రాడూన్ స్కూలులో కొంతకాలం చదువు చదివి మానేశాడు. అతని స్నేహితుల్లో గౌరవనీయులు, విద్యావంతులు ఎవరూ లేరు. ఆటోమొబైల్ యింజనీరింగు లాటిది ఏదీ చదవకపోయినా సొంతంగా కారు తయారుచేస్తానంటూ కారు మెకానిక్కులతో కలిసి తిరుగుతూంటే భరించలేక తల్లి ఇంగ్లండ్‌లో రోల్స్ రాయిస్‌లో అప్రెంటిస్ కోర్సులో చేర్పించింది. అదీ పూర్తి చేయకుండా వెనక్కి వచ్చేసి, నాకంతా వచ్చు, నేను కార్ల ఫ్యాక్టరీ పెడతా అని కూర్చున్నాడు. 1970లో తల్లి నడిపే ప్రభుత్వం అతనికి లైసెన్సు యిచ్చింది. బన్సీ లాల్ ప్రభుత్వం అక్రమ మార్గాల్లో భూమి యిచ్చింది. (మారుతి పూర్తి కథ తర్వాతి భాగాల్లో వస్తుంది) అది అన్యాయం, అక్రమం అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కేవలం తన కొడుకైన కారణంగా వేధిస్తున్నారని ఇందిర అనుకుంది. ఆమెకు మారుతి చాలా సెన్సిటివ్ యిస్యూ అయిపోయింది. మారుతితోనైనా కొడుకు ఓ దారిన పడతాడేమోనని ఆమె అనుకుని వుండవచ్చు. దాన్ని పడనివ్వనందుకు ప్రతిపక్షంపై కోపం తెచ్చుకుని వుండవచ్చు. 1977లో జనతా పార్టీ ఏర్పడినపుడు ఎన్నికల ప్రచారానికి మొరార్జీ దేశాయి హైదరాబాదు వచ్చారు. బొగ్గులకుంటలోని సరోజినీ దేవి హాల్లో సభ జరిగింది. ఆయన ఉపన్యసిస్తూ వుండగా ''మారుతీ కే బారేమేఁ కహియే'' అని జనంలోంచి డిమాండ్ వచ్చింది. ఆయన ''క్యా కహూఁ, మాఁ రోతీ హై'' అని చమత్కరించారు. మొరార్జీ జోకులు వేయడం చాలా చాలా అరుదు. అందుకే యీ పదవిన్యాసం బాగా గుర్తుండిపోయింది. చిత్రం ఏమిటంటే కొద్ది నెలలకు మొరార్జీ ప్రధాని అయ్యారు. ఆయన కొడుకు కాంతి దేశాయిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతని చుట్టూ పారిశ్రామికవేత్త లుండేవారు. పనులు చేయించుకునేవారు. ఇందిర లాగానే మొరార్జీ కూడా తన కొడుకుని వెనకేసుకుని వచ్చారు. జనతా విచ్ఛిత్తికి కాంతి దేశాయి అంశం కూడా ఒక కారణమైంది.
లోకం సంజయ్ గురించి ఏమనుకున్నా ఇందిర దృష్టిలో అతను సర్వసమర్థుడు. ఇందిరకు అత్యంత ఆత్మీయురాలైన పుపుల్ జయకర్ రాసిన ఇందిర జీవితచరిత్ర 1992లో వెలువడింది. దానిలో ఆమె సంజయ్ కారు ప్రాజెక్టు గురించి ఏమన్నారో రాశారు. ''సంజయ్ ద్వారా నాపై విపక్షాలు కత్తిగట్టాలని చూస్తున్నాయి. ఇది పద్ధతి కాదు. సంజయ్‌కు కూడా అవకాశం యివ్వాలి కదా. నాకు పెళ్లయిన కొత్తల్లో మా నాన్నగారితో కలిసి కులూ వెళ్లాను. అక్కడ ఫాదర్ కాన్‌స్టంటీన్ అనే పైలట్‌ను కలిశాను. తర్వాత అతను బొంబాయిలో రెండు గరాజ్‌లలో ఒక విమానాన్ని తయారుచేశాడు. అతను విమానాన్ని తయారు చేయగాలేనిది, సంజయ్ కారు తయారు చేయలేడా?'' అన్నారట ఇందిర. ''సంజయ్ లేకపోయి వుంటే ఇందిర గొప్ప ప్రధానిగా వ్యవహరించగలిగేవారు'' అని ఎన్ కె శేషన్ పుపుల్‌తో అన్నారట. అయితే ఇందిర అలా అనుకోలేదు. అతను కుర్రవాడైనా చాలా పరిణతి కలవాడని, తను నమ్మదగిన ఏకైక వ్యక్తి అతనేననీ ఆమె నమ్మింది. రాజీవ్ తల్లి దృష్టిలో ఒక మర్యాదస్తుడిగానే మిగిలాడు.
సంజయ్ తల్లిని చాలా వేపుకుని తిన్నాడు. ఉమా వాసుదేవ్ రాసిన ''టూ ఫేసెస్ ఆఫ్ ఇందిరా గాంధీ''లో వాటి వివరాలు వున్నాయి. ఇంత ఆకతాయి కుర్రవాడు తల్లికి ఎలా నచ్చాడా అని ఆలోచిస్తే ''మదర్ ఇండియా''లో నర్గీస్, సునీల్ దత్ పాత్రల అనుబంధం గుర్తుకు వస్తుంది. తల్లిని మంటల్లో కాల్చబోతూ వుంటే ఆ ఆకతాయి కుర్రవాడే వచ్చి రక్షిస్తాడు. తల్లి అంటే విపరీతమైన ప్రేమ. అయినా తన బుద్ధి మార్చుకోడు. తల్లికి కూడా అతనంటేనే చాలా యిష్టం. సినిమా కాబట్టి క్లయిమాక్సులో ఆమె అతన్ని దండించడానికి కాల్చి చంపుతుంది. కానీ నిజజీవితంలో ఇందిర అతని తప్పులను క్షమించడమే కాక, అతన్ని విమర్శించినవారిపై కోపం తెచ్చుకుంది. దశాబ్దాలుగా తనకు ఆత్మీయులైన వారిని అతను అవమానిస్తూ వుంటే, దూరం చేస్తూ వుంటే ఎటూ చెప్పలేక వూరుకుంది. సంజయ్ మద్దతుపైన, సలహాలపైన ఆమె ఆధారపడసాగింది. అదే ఆమె పతనానికి దారి తీసింది. అలహాబాదు హై కోర్టు తీర్పు వెలువడి ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఆమె వున్నప్పుడు సంజయ్ ఆమెపై నియంత్రణ సాధించాడు. కిరాయికి మనుష్యులను తెప్పించి తమ యింటి వద్ద ఆమెకు మద్దతుగా నినాదాలు యిప్పించి ఆమె మొరేల్‌ను బూస్ట్ చేశాడు, (అ)నైతిక స్థయిర్యాన్ని పెంచాడు. దుస్సాహసానికి ఒడిగట్టేట్టు చేశాడు. (సశేషం) (ఫోటో – ఇందిరా గాంధీ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)