గడచిన రెండు మూడేళ్లుగా పెరిగిన వేలాం వెర్రి ఒకటి వుంది టాలీవుడ్ లో. వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి, మొదటి మూడు రోజుల్లో వీలయినంత రాబట్టుకోవడం అన్నది ఆ స్ట్రాటజీ. పెద్ద సినిమాలు అన్నీ ఇదే పోకడకు పోతున్నాయి. ఎక్కువ పెట్టుబడి పెట్టడం, సినిమాల మీద నమ్మకం తక్కువ వుండడం వంటి కారణాలతో ఇలా చేస్తూ వస్తున్నారు. కానీ దీనివల్ల ఖర్చులు పెరగడం, షేర్ పడిపోవడం వంటి సమస్యలు వున్నా కూడా చూసీ చూడనట్లు వదిలేస్తూ వచ్చారు ఇన్నాళ్లు.
అయితే ఇటీవల అజ్ఞాతవాసి, స్పైడర్ లాంటి దెబ్బలు తిన్న తరువాత నిర్మాతలు, బయ్యర్ల స్ట్రాటజీ మారినట్లు కనిపిస్తోంది. సినిమా మీద కాస్త నమ్మకం వుండడం, సమ్మర్ సెలవులు, దగ్గరలో మరో భారీ సినిమా ఏదీ లేకపోవడం వంటి కారణాలతో ధైర్యం చేసి, రంగస్థలం సినిమాకు కాస్త థియేటర్ల సంఖ్య తగ్గించారు. సింగిల్, డబుల్ థియేటర్లు సెంటర్లు పక్కన పెడితే, మల్టిపుల్ థియేటర్లు వున్న చోట్ల కూడా కేవలం రెండు మూడు థియేటర్లనే తీసుకున్నారు తప్ప, అన్ని చోట్లా ఒకటే సినిమా వేసేయాలని అనుకోలేదు.
ఆంధ్రలో, సీడెడ్ లో ఈ ప్రయోగం చాలా చోట్ల జరిగింది. దాని వల్ల షేర్ లో క్లియర్ గా తేడా కనిపించింది. ఎక్కువ థియేటర్లు పెట్టి, గ్రాస్ ఎక్కువ కనిపించినా, ఖర్చులు పెరగడం, షేర్ పల్చన కావడం వంటివి, ఇప్పుడు వస్తున్న షేర్ చూసుకుంటే బాగుందని ఇండస్ట్రీ వర్గాల బొగట్టా. వేసవి సెలవులు ఇప్పడే ప్రారంభం అయ్యాయి. వారం వరకు మరో సినిమా లేదు. అప్పుడూ మీడియం సినిమా తప్ప, భారీ సినిమా లేదు. అందువల్ల కలెక్షన్లు ఎక్కడికో పోతాయన్న భయం లేదు. కానీ ఎటొచ్చీ పైరసీ కాకుండా, సిడి రాకుండా చూసుకోవాలి. అది ముఖ్యం.