కోలీవుడ్ లో కూడా మార్కెట్ పెంచుకోవాలని అనుకోవడం మంచిదే. కానీ అక్కడ కూడా క్లిక్ అవ్వాలనే లక్ష్యంతో మన హీరోలు చేస్తున్న ద్విభాషా చిత్రాలు అసలుకే ఎసరు పెడుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేస్తున్నారు.
మొన్నటికి మొన్న స్పైడర్ విషయంలో ఏం జరిగిందో చూశాం. తెలుగు, తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కించిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. కోలీవుడ్ సంగతి పక్కనపెడితే.. మహేష్ కు ఫుల్ మార్కెట్ ఉన్న టాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఆడలేదు. దీంతో ఇక్కడ ఫ్లాప్ తెచ్చుకోవడంతో పాటు చేసిన తొలి తమిళ సినిమాతో అక్కడ కూడా ఫ్లాప్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు మహేష్.
ఇప్పుడిదే బాటలో ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న సాహో సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. అంటే ఒకే సన్నివేశాన్ని మొదట తెలుగులో, తర్వాత, తమిళ్ లో, ఆ తర్వాత హిందీలో తెరకెక్కిస్తారన్నమాట. ఎంతో అనుభవం ఉన్న మురుగదాస్ వల్లే రెండు భాషల్లో తీయడం సాధ్యం కాలేదు. అలాంటిది ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ ఇప్పుడీ సాహసానికి పూనుకున్నాడు.
బాహుబలి-2 విజయాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం తప్పుకాదు. పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవాలని అనుకోవడంలో కూడా తప్పులేదు. ఎటొచ్చి మేకింగ్, ప్రమోషన్ విషయంలో ఏమాత్రం తేడావచ్చినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. దీని కంటే శ్రద్ధగా తెలుగులో సినిమా తీసి, దాన్ని ఇతర భాషల్లోకి డబ్ చేయడం మంచిదేమో.