కార్పొరేట్ విద్యా సంస్థల ముసుగు.. తెరవెనుకాల జరిగేది దొంగతనమే. ఈ దొంగతనం గురించి ఇంకెవరన్నా మాట్లాడితే అందులో నిజమెంత.? అన్న అనుమానం రావొచ్చు. ఇక్కడ, అనుమానాలకు ఆస్కారం లేదు. దొంగతనం గురించి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలే ఒకదాని మీద ఇంకోటి ఆరోపణలు చేసుకున్నాయి. అంతేనా, వ్యవహారం కేసులదాకా వెళ్ళింది.
బాగా డబ్బున్న పేరెంట్స్ తమ పిల్లల చదువుకోసం ఖరీదైన స్కూళ్ళను వెతకడం మామూలే. అలాగే, టాలెంట్ వున్న విద్యార్థుల కోసం కార్పొరేట్ స్కూళ్ళు ఎగబడటం లేటెస్ట్ ట్రెండ్. ఎగబడితే తప్పు లేదుగానీ, దొంగతనానికీ, కిడ్నాప్‌లకీ దిగడమే ఇక్కడ ఆశ్చర్యకరం. ఓ ప్రముఖ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థి మీద ఇంకో ప్రముఖ విద్యా సంస్థ కన్నేసింది. కారణం, ఆ విద్యార్థి బాగా చదువుతుండడమే. అంతే, కిడ్నాప్ చేసి పారేశారు. ఒక్కరు కాదు, ముగ్గురు విద్యార్థులిలా కిడ్నాప్ అయ్యారు.
చాలాకాలంగా జరుగుతున్న తంతే ఇది. అయితే, 'పరస్పర అవగాహన'తో ఈ కిడ్నాప్‌లు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడేమో ఈ కిడ్నాప్‌ల వ్యవహారం రచ్చకెక్కింది. బాగా చదివే విద్యార్థుల భవిష్యత్తుపై ఆయా విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి, కొంత డబ్బూ ముట్టజెప్పి 'కొనుగోలు చేయడం' అనే కాన్సెప్ట్ కూడా అక్కడక్కడా కన్పిస్తోంది. ఇది విద్యా రంగంలో నైతిక విలువల పతనానికి పరాకాష్ట.
ఇదంతా సీక్రెట్‌గా ఏమీ జరగడంలేదు.. అంతా పైకి తెలిసి జరుగుతున్న వ్యవహారమే. కానీ, విద్యాశాఖ పట్టించుకోదు. ఎందుకంటే, సదరు విద్యా సంస్థల్లో ఒకటి, స్వయానా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రిగారికి చెందినది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ రెండు విద్యా సంస్థలూ ఓ అండర్‌స్టాండింగ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. ఇకపై ఆ సంబంధాలు కొనసాగవంటూ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంస్థ యాజమాన్యం చెబుతోంది.
ఫలానా చిన్న ప్రైవేటు విద్యా సంస్థని మీరెలా నాశనం చేశారు.? అంటూ పరస్పరం ఆ రెండు విద్యా సంస్థలు ఆరోపించుకుంటున్న తీరు చూస్తే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఆ రెండు విద్యా సంస్థలు ఇంకేవో కాదు, శ్రీ చైతన్య – నారాయణ. ముగ్గురు విద్యార్థుల్ని శ్రీచైతన్య కిడ్నాప్ చేసిందన్నది నారాయణ ఆరోపణ. మేం ముగ్గుర్నే లాక్కున్నాం, మీరు లాక్కున్న (అదేనండీ, కిడ్నాప్ చేసిన) విద్యార్థుల లిస్ట్ చాలా పెద్దదే మా దగ్గర వుందంటూ చైతన్య ఎదురుదాడికి దిగింది.
విద్యా మాఫియా – అక్కడ జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించి ఇంతకన్నా సాక్ష్యం ఇంకోటి కావాలా.?