ప్రేక్షకులంటే బిగ్‌బాస్‌కు గౌర‌వం ఎక్కడ నాని?

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 నిర్వహ‌ణ తీరుపై ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్‌ హోస్ట్ నానికి కూడా సోష‌ల్ మీడియా నుంచి విమ‌ర్శల సెగ త‌ప్పలేదు. దీంతో నాని షాక్‌కు గురై…

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 నిర్వహ‌ణ తీరుపై ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్‌ హోస్ట్ నానికి కూడా సోష‌ల్ మీడియా నుంచి విమ‌ర్శల సెగ త‌ప్పలేదు. దీంతో నాని షాక్‌కు గురై “అయ్య బాబోయ్ నాకేం తెలియ‌దు… అంతా బిగ్‌బాసే చూసుకుంటారు. నేను నిమిత్త మాత్రుని” అంటూ చేతులెత్తేశారు. దీనంత‌టికి బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల త‌ప్పిద‌మే కార‌ణం. ఒక త‌ప్పు చేస్తే దాన్ని స‌రిదిద్దుకోవాల్సింది పోయి… త‌ప్పు మీద త‌ప్పు చేస్తూ స్టార్ మాటీవీ విమ‌ర్శల‌ను మూట‌క‌ట్టుకుంటోంది.

సోష‌ల్ మీడియా ద్వారా నాని ఇచ్చిన వివ‌ర‌ణ‌ను ఒక్కసారి ప‌రిశీలిద్దాం. “బిగ్‌బాస్ హోస్ట్‌గా నేను హౌస్‌లో ఉన్నవారంద‌రినీ స‌మానంగానే చూస్తాను. హౌస్‌మేట్స్ అంద‌రినీ ఒకేలా ట్రీట్ చేస్తాను. ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తారు. ఓటింగ్‌, ఎలిమినేష‌న‌ల్‌ల‌లో నా ప్రమేయం ఉంద‌ని మీలో ఎవ‌రైనా అనుకుంటే అది మీ విచ‌క్షణ‌కే వ‌దిలేస్తాను. న‌న్ను ప్రేమించినా, ద్వేషించినా ప్రేక్షకులే నా కుటుంబ స‌భ్యులు. న‌న్ను అపార్థం చేసుకోవ‌ద్దు” అని నాని ఇచ్చిన వివ‌ర‌ణ చ‌దివితే అత‌నిపై సానుభూతి క‌ల‌గ‌క‌మాన‌దు.

ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తార‌ని నాని చెప్పినంత నిజాయ‌తీ ఆచ‌ర‌ణ‌లో క‌నిపించ‌డం లేదు. అస‌లు స‌మ‌స్యే ఇక్కడ మొద‌లైంది. బిగ్‌బాస్ హౌస్ స‌భ్యులు శ్యామ‌ల‌, నూత‌న్‌నాయుడుల‌ను ప్రేక్షకులే క‌దా ఇక చాలు అని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇంటికి పంపింది. మ‌రి ఏ ప్రాతిప‌దిక‌న మ‌ళ్లీ వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించుకున్నారో నాని స‌మాధానం చెప్పాలి.

నాని చెబుతున్నట్టు ప్రేక్షకుల అభిప్రాయానికి గౌర‌వం ఇచ్చిన‌ట్టైతే తిరిగి వారిని వైల్డ్‌కార్డ్ ఎంట్రీలుగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశ పెట్టేవాళ్లు కాదు. బ‌య‌టి విష‌యాల‌ను క్షుణ్ణంగా అధ్యయ‌నం చేసిన వారిద్దరి ప్రవేశంతో బిగ్‌బాస్ హౌస్‌లో వాతావ‌ర‌ణం పూర్తిగా క‌లుషిత‌మైంది. ఇప్పుడు నూత‌న్‌నాయుడు, శ్యామ‌ల బ‌య‌టి విష‌యాల‌ను అక్కడ ప్రస్తావించార‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్రవ‌ర్తించార‌ని నాని ప్రశ్నించ‌డం ఆశ్చర్యంగా ఉంది.

ఈ కార‌ణంతో ప్రేక్షకుల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా నూత‌న్‌నాయుడిని మాత్రమే ఎలిమినేష‌న్ చేయ‌డం అస‌లు వివాదానికి కేంద్ర బిందువైంది. శ్యామ‌ల‌ను మాత్రం క్షమాప‌ణ‌తో విడిచి పెట్టడంతో ప్రేక్షకులు విస్మయానికి గుర‌య్యారు. హౌస్‌మేట్స్ అంద‌రినీ స‌మానంగా ట్రీట్ చేస్తాన‌ని నాని చెబుతున్నప్పటికీ, అది క‌రెక్ట్ కాద‌ని ఎలిమినేట్ అయిన హేతువాది బాబు గోగినేని వాదిస్తున్నారు.

వాడు, గీడు అని కౌశ‌ల్‌ను సంబోధించిన తేజ‌శ్వినీపై నిప్పులు చెరిగిన నాని, అదే విధ‌మైన భాష‌ను త‌న‌పై కౌశ‌ల్ ప్రయోగిస్తే ఎందుకు నిమ్మకుండి పోయార‌ని నానిని బాబు నిల‌దీస్తున్నారు. ఇలా అడుగ‌డుగునా బిగ్‌బాస్ సీజ‌న్‌-2 నిర్వహ‌ణ‌లో స్టార్ మాటీవీ యాజ‌మాన్యం చేస్తున్న త‌ప్పిదాల‌కు హోస్ట్ నాని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి రావ‌డం బాధాక‌రం. అయితే రోటిలో త‌ల‌పెట్టాక రోక‌టి పోట్లు త‌ప్పవు కాదు నాని.