టాలీవుడ్ కు అమెజాన్ ప్రయిమ్ అన్నది పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. ముఫై రోజుల్లో సినిమా ప్రయిమ్ లోకి వచ్చేస్తుందన్న విషయం కింద వరకు పాకేసింది. దాంతో సినిమాలకు వచ్చేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.
మరీ పెద్ద సినిమాలు అయితే, అది కూడా అద్భుతం అంటే తప్ప థియేటర్లకు రావడం లేదు. అలా అని అమెజాన్ కు ఇవ్వకుండా వుండలేరు నిర్మాతలు. దాని వల్ల వచ్చే ఆదాయం వదులుకోలేరు. అప్పటికీ తెలుగునాట అంతగా పాపులర్ కాని నెట్ ఫ్లిక్స్ వంటి వాటికి విక్రయిస్తున్నారు. ఏమైనా ప్రయిమ్..ప్రయిమ్ నే.
అయితే ఇదే అమెజాన్ ప్రయిమ్ వల్ల మరో సమస్య కూడా వచ్చేలా కనిపిస్తోంది. అదేంటంటే పరభాషా సినిమాలు మన వాళ్లు కొని రీమేక్ చేయాలి అనుకున్నపుడు వస్తున్న సమస్య. సాధారణంగా గతంలో అయితే, ఓ తమిళ సినిమాలో మరో సినిమానో తెలుగు లోకి రీమేక్ చేయడానికి కొంటే అది యూ ట్యూబ్ లోకి రాకుండా చూసకునేవారు. కానీ ఇఫ్పుడు అలాకాదు, సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రయిమ్ లో రెడీగా వుంటోంది.
నితిన్ హీరోగా అంథాదూన్, రామ్ హీరోగా తడమ్, వెంకీ హీరోగా అసురన్ సినిమాలు ఇప్పుడు సెట్ మీదకు వెళ్తున్నాయి. ఈ మూడు సినిమాలు ఎలా వుంటాయో చూడాలంటే ప్రయిమ్ లో రెడీగా వున్నాయి. అందువల్ల మన జనాలు కూడా వాటినీ, వీటినీ పోల్చుకునే సమస్య వస్తుంది. కథ ముందే తెలిసిపోతుంది. ఇలా చాలా వుంటాయి సమస్యలు. కానీ తప్పదు. అమెజాన్ ప్రయిమ్ అవేవీ పట్టించుకోదు. దానికి వ్యాపారం వ్యాపారమే.