మెగాస్టార్ చిరంజీవి సినిమా మీద పూరి జగన్నాధ్ విరక్తితో వున్నాడా? ఈ బంధంపై అటు మెగా క్యాంప్, ఇటు పూరి కూడా వుంటే వుంటుంది..లేకుంటే లేదు అనే టైపులోనే ఆలోచిస్తున్నాయని తెలుస్తోంది.
పూరి అదిరిపోయే మంచి కథ తెస్తే మనకే మంచిది. అవకాశం ఇచ్చి, మనకు కావాల్సినట్లు సినిమా తీయుంచుకుందాం అని మెగాక్యాంప్ లో అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
కథ విషయంలో, సినిమా విషయంలో తమ దారికి పూరీ రావాలే కానీ, పూరి దారికి తాము వెళ్లేది వుండదని వారికి తెలుసు. ఇప్పుడు అదే పూరీ ని కూడా ఇబ్బంది పెడుతోంది. ఇదే మరో హీరో అయితే పూరి లైన్ చెప్పడంతో సరి. అంతకు మించి పట్టించుకోరు. పూరి ఏం చెబితే అది చేసుకుపోవడం తప్ప. కానీ మెగా క్యాంప్ టైటిల్ నుంచి శుభం కార్డు వరకు ప్రతీదీ వారి అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్లాల్సిందే.
పైగా 150 వ సినిమా అంటే చిరు చాదస్తం మరీ పీక్ కు వెళ్లిపోయిందట. ఇలా వుండాలి..అలా వుండాలి అనే సూచనల సంఖ్య తక్కువేమీ కాదని వినికడి. దీంతో పూరి ఇది వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదని అనుకుంటున్నడని వినికిడి.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇటు రెండు వర్గాలు తమంతట తాము కట్ చేసుకోవాలని అనుకోవడం లేదు. చేస్తే చేద్దాం అనే ఉద్దేశంతోనే వున్నారు. అందుకే పూరి తన మానాన తను వరుణ్ తేజ్ సినిమా చేసుకుంటున్నాడు.
ఆగస్టు 22లోగా పిలుపు వస్తే, చేద్దాం.అనుకుంటున్నాడట పూరీ. ఇది తెలిసే, పూరి గురువు రామ్ గోపాల్ వర్మ కావాలని మెగా క్యాంప్ ను కెలుకుతున్నాడు. ఒక విధంగా మెగాస్టార్ తన సినిమాపై ముందుకు వెళ్లడానికి భయపడే విధంగా, మరో డైరక్టర్ అటు వెళ్లడానికి అనుమానపడేవిధంగా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.
రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా అన్నది కలలో మాట. ఎప్పడో రాజమౌళి సినిమాలో సూటయిన పాత్ర వుంటే చేయచ్చేమో కానీ, హీరోగా చేయడం అన్నది దాదాపు వుండకపోవచ్చు. అలాంటి రాజమౌళిని బాహుబలి విజయాన్ని ముందు చూపించి, మెగాస్టార్ తో సినిమా చేయాలనుకునే వాళ్లను ముందు భయపడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.
అయితే ఆ విధంగా ఆయన పూరికి మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడేమో. కానీ అసలు విషయాలు తెలియనంత అమాయకం కాదు మెగా క్యాంప్. వారి ఆలోచనల్లో వారున్నారు. కానీ వర్మ చేస్తున్నది మాత్రం పూరికి డ్యామేజీనే కానీ ఫ్యావర్ మాత్రం కాబోదు.