సెటప్ అంతా రెడీ.. డబ్బులు పెట్టేదెవరు?

కొడుకును హీరోగా పెట్టి చేతులు కాల్చుకున్నాడు పూరి జగన్నాథ్. మెహబూబా సినిమా ఇటు పూరి జగన్నాద్ కు, అటు పూరికొడుకు ఆకాష్ కు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ సినిమా దెబ్బకు నిర్మాతగా…

కొడుకును హీరోగా పెట్టి చేతులు కాల్చుకున్నాడు పూరి జగన్నాథ్. మెహబూబా సినిమా ఇటు పూరి జగన్నాద్ కు, అటు పూరికొడుకు ఆకాష్ కు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ సినిమా దెబ్బకు నిర్మాతగా ఆర్థికంగా కూడా దెబ్బతిన్న పూరి జగన్నాథ్, ఇప్పుడు మరోసారి కొడుకును హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నాడు. 

ఈసారి మాత్రం పూరి కాస్త జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఆకాష్ సినిమాకు తను కేవలం కథ మాత్రమే అందిస్తున్నాడు. మాటలు కూడా రాసిచ్చాడు. దర్శకత్వ బాధ్యతల్ని మాత్రం తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన అనీల్ అనే వ్యక్తికి అప్పగిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ ప్రాజెక్టుకు నిర్మాత ఎవరనేది ప్రశ్న.

బయట నిర్మాతలు ఎవరూ ప్రస్తుతానికి ఆకాష్ తో సినిమా చేయరు. దిల్ రాజు లాంటి నిర్మాత చేతిలో పడితే బాగుంటుంది కానీ, అదే దిల్ రాజును మెహబూబాతో ముంచేశాడు పూరి. కాబట్టి అడగలేడు. అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి నిర్మాతలతో పూరికి సత్సంబంధాలు ఉన్నాయి కానీ, ఆకాష్ తో సినిమా చేసే పొజిషన్ లో వాళ్లు లేరు. 

ప్రస్తుతానికైతే ఓ చిన్న నిర్మాత కోసం పూరి జగన్నాధ్ వెయిటింగ్. ఎవరైనా ముందుకొస్తే, అతడితో కలిసి పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తను కొంత డబ్బుపెట్టి సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎవరు ముందుకొస్తారో చూడాలి. మరోవైపు ఆకాష్ మాత్రం కొత్త సినిమా కోసం సరికొత్తగా ముస్తాబవుతున్నాడు. మేకోవర్ పనుల్లో మునిగిపోయాడు.