ప్రణయ్ హత్యోదంతం.. సినిమాపై ఆర్జీవీ మౌనం

వివాదం, క్రైమ్ అంటే రామ్ గోపాల్ వర్మకి పిచ్చి. ఎక్కడ ఏ దారుణం జరిగినా, పెద్ద తలకాయల సహజ మరణం అయినా సరే రామ్ గోపాల్ వర్మ దేన్నీ విడిచి పెట్టడు. కచ్చితంగా దాన్ని…

వివాదం, క్రైమ్ అంటే రామ్ గోపాల్ వర్మకి పిచ్చి. ఎక్కడ ఏ దారుణం జరిగినా, పెద్ద తలకాయల సహజ మరణం అయినా సరే రామ్ గోపాల్ వర్మ దేన్నీ విడిచి పెట్టడు. కచ్చితంగా దాన్ని సినిమా తీస్తానంటూ ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్ట్ చేస్తాడు. రెండురోజుల తర్వాత సీన్లో వాలిపోయి వివరాల సేకరణ అంటూ నానా హడావుడీ చేస్తాడు, ఇంకో రెండు రోజులకే ఫస్ట్ పోస్టర్ పడిపోతుంది. ఆ తర్వాత సినిమా చేస్తాడా చేయడా అనేది ఆయన ఇష్టం.

ఏమైందో ఏమో ఇటీవల జరిగిన పరువు హత్యకి మాత్రం దూరంగా ఉన్నాడు వర్మ. సినిమాను మించిన సినిమాటిక్ గా జరిగింది ప్రణయ్ హత్యోదంతం. సొంత మామే సుపారీ ఇచ్చి మరీ అల్లుడిని దారుణంగా చంపించాడు. సీసీ కెమెరా ఫుటేజీ దగ్గర్నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ జనానికి బాగా తెలుసు.

ఈమధ్య కాలంలో ఆర్జీవీ సినిమాలని చూసిన ఎవరికైనా కచ్చితంగా ఈ ఎపిసోడ్ ని ఆయన తెరకెక్కిస్తాడనే అనుమానం రాకమానదు. అయితే వివాదాల రామ్ గోపాలుడు ఈ వ్యవహారానికి పూర్తి దూరంగా ఉన్నాడు. ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించిన వర్మ, ఘటనపై సినిమా తీస్తానని మాత్రం ప్రకటించలేదు.

జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై క్షణాల్లో ట్విట్టర్లో స్పందించే వర్మ, ప్రణయ్ హత్యోదంతంపై కూడా రియాక్ట్ అయ్యాడు. ఇది నిజంగా పరువు హత్యే అయితే, మారుతిరావు పరువు కూడా పోయింది. మారుతిరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాలని 3 రోజుల కిందటే ట్వీట్ చేశాడు వర్మ. ఇక ఈ ఘటనపై ఏ క్షణానైనా సినిమా ఎనౌన్స్ చేస్తాడని అంతా ఊహించినప్పటికీ, వర్మ మాత్రం సైలెంట్ అయిపోయాడు.

సినిమాల సక్సెస్ కి కేవలం వివాదాలనే పెట్టుబడిగా వాడుకునే వర్మకి ఈమధ్య ఎదురు దెబ్బలు బాగానే తగిలాయి. మియా మాల్కోవాతో చేసిన అడల్డ్ వెబ్ ఫిలిం వల్ల ఇతడు పోలీసు విచారణ ఎదుర్కొన్నాడు. దీంతోపాటు రీసెంట్ గా వచ్చిన ఆఫీసర్ సినిమా వర్మకున్న ఆ కొద్దిపాటి ఇమేజ్ ను కూడా తుడిచిపెట్టేసింది.

దీనికితోడు ప్రణయ్ హత్య కేసు వ్యవహారంలో సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. కులాంతర ప్రేమలను ప్రోత్సహించేవారు, తల్లిదండ్రుల ప్రేమలను బలపరిచేవారుగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సో.. ఈ ఎపిసోడ్ లో వేలు పెడితే పచ్చడవుతుంది తప్ప పచ్చనోట్లు వచ్చేలా కనిపించలేదు వర్మకు.

పైగా పరువు హత్యలపై ఇప్పటికే సైరాట్ అనే మరాఠీ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. తర్వాత ఇదే సినిమా బాలీవుడ్ రీమేక్ కూడా అయింది. ఇప్పుడు వర్మ ఫ్రెష్ గా మరో సినిమా తీస్తే, కచ్చితంగా సైరాట్ తో కంపేరిజన్ ఉంటుంది. అందుకే వర్మ సైలెట్ అయిపోయాడేమో..