బెల్లంకొండ సురేష్ ప్రెస్టీజియస్ గా నిర్మించిన సినిమా రభస. ఇప్పుడీ సినిమాపై టాలీవుడ్ జనాలు ఆసక్తికరంగా వున్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఇందులో హీరోకావడం తో ఏర్పడిన ఆసక్తి కాదు ఇది. నిర్మాత, దర్శకులకు నడుమ ఏర్పడిన కాన్ ఫ్లిక్ట్ కారణంగా సినిమానిర్మాణం ఆద్యంతం కనిపించని రభస జరిగిందని టాలీవుడ్ జనాలు గుసగుసలు పోతున్నారు. ఒక దశలో హీరో ఎన్టీఆర్ నిర్మాత దర్శకులు ఇద్దరినీ పిలిచి మరీ నచ్చ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినికిడి.
ఇంతటి పరిస్థితికి దారితీసిన వైనం ఒకటి వుంది. కందిరీగ తరువాత రెండో సినిమాకు కూడా బెల్లంకొండతో ఒప్పందం చేసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్. అయితే ఆ సినిమా హిట్ తరువాత బయట కాస్త పెద్ద మొత్తాలతో ఆఫర్లు వచ్చాయి. ఆ విషయమే బెల్లంకొండకు చెప్పి, రెండో సినిమా బదులు మూడో సినిమా చేస్తానని లేదంటే, పారితోషికం కాస్త పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ దీనికి బెల్లంకొండ అంగీకరించలేదు. పైగా రెండో సినిమా చేసి తీరాల్సిందే అని పట్టుపట్టడం, అది కాస్త హద్దుల దాటడం జరిగిందని టాలీవుడ్ జనాలు అంటుంటారు.
ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభమైంది. టైటిల్ లాగే నిర్మాత, దర్శకుల నడుమ రభస అలాగే కొనసాగుతోందని, షూటింగ్ ఆద్యంతం ఇదే తరహా వ్యవహారాన్ని యూనిట్ గమనించిందని వినికిడి. దేవీకి బదులు థమన్ రావడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. ఆ సంగతి ఎలా వున్నా, టీజర్ వ్యవహారం కూడా ఇలాగే నడించిందని, అంత కన్నా ఇంకేమీ లేదని టీజర్ మార్చేందుకు దర్శకుడు సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు.
ఇక అన్నింటికి మించి మరో రెండు రోజుల్లో అడియో ఫంక్షన్ వుంది. దీని గురించి దర్ళకుడి దగ్గర ప్రస్తావించిన వాళ్లకి, తాను అతిధిగా వస్తానని, అంతకు మించి తనకేమీ తెలియదని సమాధానమిచ్చినట్లు సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తయారైన రభస మరి ఎలా వుంటుందో? కెరియర్ అటు ఇటుగా వున్న ఎన్టీఆర్ కు ఏ మాత్రం సాయం చేస్తుందో చూడాలి. అయితే రభస లైన్ మాత్రం చాలా ఆసక్తికరం అని అంటున్నారు. కాబట్టి అభిమానులు ఆందోళన పడక్కరలేదు.