ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై ప్రస్తుతం రాజమౌళి వర్కవుట్ చేస్తున్నాడు. నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లు బాగానే ఉన్నప్పటికీ.. లుక్ పరంగా కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో రాజమౌళిని రంగంలోకి దింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సలహాలు-సూచనలు ఇవ్వడానికి ఒప్పుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆ పనిమీద ఉన్నాడు.
లండన్ వెళ్లి డిజైన్లకు మార్పుచేర్పులు సూచించిన తర్వాత మొత్తం ప్రాసెస్ పూర్తవ్వడానికి కనీసం నెలరోజులు పడుతుందట. సో.. ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు తన కొత్త సినిమా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.
నిజానికి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి, అతడి తండ్రి విజయేంద్రప్రసాద్ కలిసి ఇప్పటికే ఓ స్టోరీలైన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీవల్లీ సినిమా విడుదల తర్వాత విజయేంద్రప్రసాద్ ఈ స్టోరీలైన్ మీదే కూర్చున్నారట. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాతే సినిమాను అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నాడట రాజమౌళి.
రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను రామ్ చరణ్ లేదా మహేష్ తో తీస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సో.. వీళ్లతోనే సినిమా చేయాలనుకుంటే ఈ దర్శకుడికి ఇంకొన్నాళ్లు గ్యాప్ తప్పదు. తన నెక్ట్స్ సినిమాను నిర్మాతలు దానయ్య, కేఎల్ నారాయణకు కలిపి చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.