రాజశేఖర్‌ ఆ సినిమానూ మిస్‌ అయ్యాడా?

ప్రతి గింజమీదా తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. ఈ నియమం సినిమాలకు కూడా వర్తించేలాగుంది. ఏ సినిమా ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది. ఏ సినిమాతో ఎవరి రాత మారిపోవాలో వారిరాతే మారిపోతుంది. అవే…

ప్రతి గింజమీదా తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. ఈ నియమం సినిమాలకు కూడా వర్తించేలాగుంది. ఏ సినిమా ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది. ఏ సినిమాతో ఎవరి రాత మారిపోవాలో వారిరాతే మారిపోతుంది. అవే సినిమాల విషయంలో వేరేవాళ్ల ప్రయత్నాలూ ఫలించవు, వేరేవాళ్ల కోసం అవే సినిమాల రూపకర్తలు ఎంతగా ప్రయత్నించినా వాళ్లు దగ్గరికిరారు. బహుశా విధిరాత అంటే అదేనేమో. ఈ మధ్యనే 'అర్జున్‌ రెడ్డి' సినిమా విషయంలో తను ఎవరెవరి కోసం ప్రయత్నించానో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వివరించి చెప్పాడు. సినిమా విడుదలకు ముందే ఈ దర్శకుడు తను ఏయే హీరోల కోసం ఈ కాన్సెప్ట్‌ను వివరించానో చెప్పాడు.

ప్రధానంగా అల్లుఅర్జున్‌ కోసం ప్రయత్నించాను అని.. అయితే అల్లువారబ్బాయిని కలిసే అవకాశమే తనకు దక్కలేదని సందీప్‌ చెప్పాడు. ఇక ఈ సినిమా కథకు శర్వానంద్‌ ఓకే చెప్పినప్పటికీ.. శర్వాతో ఈ సినిమాను రూపొందించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకురాలేదు. కథలోని బోల్డ్‌నెస్‌కు వాళ్లు భయపడ్డారు. చివరకు ఏమైంది.. అర్జున్‌ రెడ్డి వెళ్లి విజయ్‌ దేవరకొండను స్టార్‌గా చేసేసింది. ఇప్పుడు మణిరత్నం, గౌతమ్‌ మీనన్‌లు మొదలుకుని చాలామంది ప్రముఖ దర్శకులు విజయ్‌ కోసం వెంటపడుతున్నారు. అతడితో సినిమా చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో విజయ్‌ అంత డిమాండ్‌ ఉన్న హీరో మరొకరు ఎవరూలేరేమో. పెద్ద పెద్ద బ్యానర్లు, పేరున్న డైరెక్టర్లు విజయ్‌ వెంట పడుతున్నారు. మరి ఇదే సినిమాను అల్లుఅర్జునో, శర్వానందో చేసి ఉంటే.. మార్పుల్లేకుండా వారితో ఈ సినిమాను చేసి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. అర్జున్‌ రెడ్డి విజయం విజయ్‌ కోసం రాసి పెట్టినట్టుంది.

ఇలా చెప్పుకొంటూపోతే గేమ్‌ చైంజింగ్‌ మొమెంట్స్‌ చాలానే ఉంటాయి. అర్జున్‌ రెడ్డి లాంటి అరుదైన సినిమాను కొంతమంది హీరోలు మిస్‌కావడం, అది మరొకరికి దక్కడం జరిగింది. ఈ రేంజ్‌ సినిమాలకు కూడా పలుసార్లు హీరోలు మారిపోయిన సందర్భాలున్నాయి. అలాంటి ఉదాహరణలను కొన్ని ప్రస్తావిస్తే 'సింహాద్రి' కూడా అలాంటి జాబితాలోనే. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పనక్కర్లేదు.

ఇందులో ఎన్టీఆర్‌ హీరోగా నటించి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదే కాన్సెప్ట్‌ ముందుగా వెళ్లింది బాలయ్య దగ్గరకు అట. అప్పటికే విజయేంద్ర ప్రసాద్‌ రచనలో బాలయ్యకు బొబ్బిలి సింహం వంటి హిట్టుంది. అయినప్పటికీ సింహాద్రి బాలయ్యకు అంతగా ఎక్కలేదు. అదే ఎన్టీఆర్‌ పాలిట వరం అయ్యింది. సంచలన విజయాన్ని ఈ హీరోకి సొంతం చేసింది.

దర్శకుడు శంకర్‌ ఫస్ట్‌ సినిమా రావడం సౌతిండియన్‌ మూవీ ఇండస్ట్రీకే పెద్ద చైంజర్‌. అప్పటి వరకూ వస్తున్న మూస ట్రెండ్‌కు శంకర్‌ బ్రేక్‌ వేశాడు. సంచలనాలు అనదగ్గ సినిమాలను రూపొందించాడు. సౌతిండియన్‌ నంబర్‌ వన్‌ అనే కొత్త హోదాకు శ్రీకారం చుట్టాడు. అలాంటి శంకర్‌ దర్శకుడిగా రూపొందించిన తొలి సినిమా 'జెంటిల్‌మన్‌'. ఆ సినిమా కథ మరీ కొత్తదేంకాదు. అప్పటి వరకూ అలాంటి రాబిన్‌హుడ్‌ కాన్సెప్టులు బోలెడన్ని వచ్చాయి.

అయితే శంకర్‌ కథ చెప్పిన విధానం, అతడి టేకింగ్‌, స్టైలిష్‌ మేకింగ్‌.. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిలిచాయి. వండర్‌ఫుల్‌ అనిపించుకున్నాయి. ఆ సినిమా అర్జున్‌ను స్టార్‌ని చేసింది. అప్పటివరకూ చోటామోటా సినిమాలు చేస్తూ వచ్చిన అర్జున్‌ని అది యాక్షన్‌ కింగ్‌గా మార్చింది. అది అర్జున్‌ లక్‌. ఆ లక్‌ను మిస్‌ అయిన వాళ్ల జాబితాలో రాజశేఖర్‌ ఉన్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక టీవీ షోలో రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.

అప్పటికే రాజశేఖర్‌కు తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపు ఉంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా కొన్ని సూపర్‌ హిట్లు కూడా ఉన్నాయి. అర్లీ నైంటీస్‌ రాజశేఖర్‌కు పీక్‌స్టేజ్‌. అదే దశలో 'జెంటిల్మన్‌' సినిమా రాజశేఖర్‌ వద్దకే వచ్చిందట. అయితే తనకు అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్‌తో ఆ సినిమా చేయలేకపోయానని రాజశేఖర్‌ చెప్పాడు. ఒకవేళ ఆ సినిమాను రాజశేఖర్‌ చేసి ఉంటే.. ఈ హీరో కెరీర్‌లో అదొక మైలురాయి అయ్యేది. రాజశేఖర్‌ కెరీర్‌లో జెంటిల్మన్‌ స్థాయి సినిమాలు లేవనికాదు.. అంకుశం, మగాడు, ఆహుతి వంటి సినిమాలు సూపర్‌ హిట్లే. అయితే.. వీటికి తోడు 'జెంటిల్మన్‌' లాంటి సినిమా పడిఉంటే.. ఆ కథ వేరేగా ఉండేది. అయితే రాజశేఖర్‌ ఆ సినిమాను జస్ట్‌ మిస్సయ్యాడంతే! రాసి పెట్టిలేదు పాపం.

ఇక ఇదే హీరో విషయానికి వస్తే.. ఈయన మిస్‌ అయిన సినిమాలు మరిన్ని ఉన్నాయి. ఆ విషయాలను కూడా రాజశేఖర్‌ ఒకసారి ఏకరువు పెట్టారు. పలు తమిళ సినిమాల అనువాద హక్కులను రాజశేఖర్‌ కొనుక్కొంటే తెలివిగా వేరేవాళ్లు రంగంలోకి దిగి వాటిని రాజశేఖర్‌కు దక్కకుండా చేశారని సమాచారం. అందుకు ఉదాహరణలుగా 'ఠాగూర్‌', 'లక్ష్మీ నరసింహా' వంటి సినిమాలను పేర్కొనవచ్చు. తమిళంలో విజయ్‌కాంత్‌ హీరోగా సూపర్‌ హిట్‌ అయిన 'రమణ' రీమేక్‌ హక్కులకు రాజశేఖర్‌ అడ్వాన్స్‌ కూడా చెల్లించాడట. అయితే అనూహ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి చేతుల్లోకి వచ్చాయి ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌.

రాజశేఖర్‌ ఇచ్చిన అడ్వాన్స్‌ మొత్తాన్ని వెనక్కు ఇచ్చి మరీ ఆ సినిమా రైట్స్‌ను చిరంజీవి వాళ్లకు ఇచ్చారట తమిళ మేకర్లు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని రాజశేఖర్‌ ఒకసారి చెప్పారు. కుట్ర అనేది పెద్దపదమే కానీ.. తమిళ సినిమా హిట్టైన తీరును చూసి వేరేవాళ్లు తమ ఇన్‌ ఫ్లుయన్స్‌ను ఉపయోగించుకుని రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకోవడం అని మాత్రం అనొచ్చు. అలాగే లక్ష్మీనరసింహా విషయంలో కూడా అలాగే జరిగిందట, రాజశేఖర్‌ రంగంలోకి దిగిన తర్వాత బాలయ్య అండ్‌ కో రంగంలోకి దిగి ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకుందట.

మరి ఇలా సూపర్‌ హిట్‌ సినిమాల రీమేక్‌ రైట్స్‌ రాజశేఖర్‌కు దక్కినట్టుగానే దక్కి చేజారగా.. ఫెయిల్యూర్‌ అయ్యే సబ్జెక్ట్‌ రీమేక్‌ రైట్స్‌ మాత్రం రాజశేఖర్‌కే దక్కాయి. అప్పట్లో రీమేక్‌ల పిచ్చిలో రాజశేఖర్‌ తమిళ 'సేతూ'ని రీమేక్‌ చేశాడు. అలాగే విక్రమ్‌ సినిమా మరోదాన్ని 'విలన్‌' పేరుతో రీమేక్‌ చేశాడు. కానీ అవేవీ ఆడలేదు. ఫెయిల్యూర్స్‌గా నిలిచిపోయాయి. కొంతలో కొంత 'ఎవడైతే నాకేంటి' రీమేక్‌ మాత్రం రాజశేఖర్‌కు ఊరటనిచ్చింది. విజయ్‌ హీరోగా నటించిన తమిళ సినిమాను అలా రీమేక్‌ చేశాడు రాజశేఖర్‌.

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఒకసారి తను మిస్‌ అయిన సినిమా విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటేష్‌ హీరోగా వచ్చిన 'చంటి' ఒరిజినల్‌ వెర్షన్‌ కూడా తమిళ సినిమానే అని వేరే చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తెలుగులో చేయాలని రాజేంద్రుడు ప్రయత్నాల్లో ఉండగానే, దగ్గుబాటి వాళ్లు రంగంలోకి దిగి వెంకటేష్‌ హీరోగా ఆ సినిమాను ప్రారంభించేశారట. దీంతో రాజేంద్రుడు చాలా హర్ట్‌ అయినట్టుగా చాలాసార్లు చెప్పారు.

ఇక మణిరత్నం 'ఘర్షణ' సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని మొదట అనుకున్నారు. వెంకటేష్‌, నాగార్జున కాంబోలో ఆ సినిమా రూపొందించాలని అనుకున్నా అది సాధ్యంకాలేదు. దీంతో తమిళ వెర్షన్‌నే యథాతథంగా డబ్‌ చేశారు. అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అప్పటికే మణిరత్నం తెలుగు నిర్మాతతో కలిగిన కమిట్‌మెంట్‌తో 'గీతాంజలి' వచ్చింది. సంచలనాన్ని నమోదు చేసింది. ఒకవేళ నాగార్జున- వెంకీ కాంబోలో ఘర్షణ రీమేక్‌ మొదలై ఉంటే.. గీతాంజలి డైరెక్ట్‌ తెలుగు సినిమాగా వచ్చే అవకాశాలు తక్కువ. మణిరత్నం ఈ సినిమాను ఏ తమిళంలోనో చేసేవాడేమో.. ఇంకో హీరోతో!

అలాగే మణిరత్నం 'రోజా', శంకర్‌, 'ఒకేఒక్కడు' సినిమాలు తెలుగులోకి డబ్‌ కాకుండా రీమేక్‌ అనుకున్న సందర్భాల్లో వెంకటేష్‌ పేరే తెరపైకి వచ్చింది. అయితే రీమేక్‌లు కాలేదు ఆ సినిమాలు. డబ్‌ అయ్యి తెలుగునాట సూపర్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్నాయి.