రాజశేఖర్‌ సరే.. చిరు మాటేమిటి.?

హీరో రాజశేఖర్‌ విలన్‌గా నటిస్తున్నాంటున్నాడు. అది కూడా చిరంజీవి సినిమాలో విలనిజం పండిస్తానని చెబుతున్నాడు. ఈ మాట ఇప్పుడాయన కొత్తగా చెప్పడంలేదు. గత కొంతకాలంగా రాజశేఖర్‌ ఇదే మాట చెబుతూ అందరి దృష్టినీ తనవైపుకు…

హీరో రాజశేఖర్‌ విలన్‌గా నటిస్తున్నాంటున్నాడు. అది కూడా చిరంజీవి సినిమాలో విలనిజం పండిస్తానని చెబుతున్నాడు. ఈ మాట ఇప్పుడాయన కొత్తగా చెప్పడంలేదు. గత కొంతకాలంగా రాజశేఖర్‌ ఇదే మాట చెబుతూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంటుండడం సినీ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

2009 ఎన్నికల సమయంలో చిరంజీవి – రాజశేఖర్‌ మధ్య రాజకీయ పోరాటం జరిగింది. అప్పటికి రాజశేఖర్‌ కాంగ్రెస్‌లో వున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేత ఆ సమయంలో. చిరంజీవిపై పదే పదే విమర్శలు చేస్తూ రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవిత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు కదా, చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్ళారు.. కాంగ్రెస్‌ నుంచి జీవిత, రాజశేఖర్‌ బయటకొచ్చారు.

అలా రాజకీయాలపై ఓ అవగాహన కలిగింది జీవిత, రాజశేఖర్‌ దంపతులకి. ఆ తర్వాత చిరంజీవిపై పెద్దగా ఎక్కడా విమర్శలు చేసిన దాఖలాల్లేవు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిరంజీవితో నటించాలని వుందనే మనసులో కోరికను రాజశేఖర్‌ బయటపెట్టడమంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎలాగూ చిరంజీవి సినిమాల్లో మళ్ళీ నటించాలనుకుంటున్నారు గనుక, రాజశేఖర్‌ కోరికని చిరంజీవి తీర్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇంతకీ చిరంజీవి 150వ సినిమా చేస్తారంటారా.? చేసినా, రాజశేఖర్‌కి అవకాశం కల్పిస్తారంటారా.? పదే పదే చిరంజీవితో నటించాలన్న తన కోరికని బయటపెడ్తున్న రాజశేఖర్‌ – చిరంజీవి సినిమాలో నటిస్తాడో లేదో కొన్ని రోజులాగితే తెలుస్తుంది.