పగలు హాస్టల్ వార్డెన్.. రాత్రి డాన్

వరుసగా మూడోసారి డాన్ పాత్రకే మొగ్గుచూపాడు రజనీకాంత్. ఆ పాత్రలతో వరుసగా ఫ్లాపులొచ్చినప్పటికీ ఈసారి డాన్ క్యారెక్టర్ తోనే మరో ప్రయత్నం చేయబోతున్నాడు. అవును.. ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న సినిమాలో కూడా అతడిది డాన్…

వరుసగా మూడోసారి డాన్ పాత్రకే మొగ్గుచూపాడు రజనీకాంత్. ఆ పాత్రలతో వరుసగా ఫ్లాపులొచ్చినప్పటికీ ఈసారి డాన్ క్యారెక్టర్ తోనే మరో ప్రయత్నం చేయబోతున్నాడు. అవును.. ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న సినిమాలో కూడా అతడిది డాన్ క్యారెక్టరే. కాకపోతే అందులో చిన్నమార్పు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రజనీకాంత్ పగలు హాస్టల్ వార్డెన్ లా కనిపిస్తాడు. చీకటిపడిన వెంటనే డాన్ గా మారిపోతాడన్నమాట. అదే ఇతడి క్యారెక్టర్.

భాషా సినిమాలో ఇలాంటి ఛాయలే కనిపిస్తాయి. పైకి ఆటోడ్రైవర్ లా కనిపిస్తుంటాడు కానీ ఫ్లాష్ బ్యాక్ లో డాన్ అతడు. కానీ కొత్త సినిమాలో మాత్రం వార్డెన్, డాన్ పాత్రల్ని సైమల్టేనియస్ గా పోషిస్తాడట రజనీకాంత్. ఇలా క్లాస్ అండ్ మాస్ పాత్రల్లో ఒకేసారి కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇద్దరు నటీనటుల్ని తీసుకున్నారు. వాళ్లే సిమ్రాన్, నవజుద్దీన్ సిద్ధిఖి. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్, రీఎంట్రీలో అతడి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక బాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్న నవజుద్దీన్ ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత చెన్నైలో మరో షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ఆగస్ట్ 10 నుంచి చెన్నైలో ప్రారంభంకాబోతున్న షెడ్యూల్ కోసం మధురై సెట్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత లక్నోకు యూనిట్ షిఫ్ట్ అవుతుంది.

రజనీకాంత్ కెరీర్ లో ఇదే ఆఖరి సినిమా అనే ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికలలోపు ఈ సినిమాను పూర్తిచేసి, తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నాడు రజనీకాంత్.