'బాహుబలి' తర్వాత వచ్చే తన సినిమాపై వుండే అంచనాలని రీచ్ అవడానికి ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా అయితే అనౌన్స్ చేసాడు కానీ ఆ చిత్రాన్ని సాదాసీదాగా తీసేస్తే చాలదని కూడా రాజమౌళి గుర్తించాడు. అందుకే ఇంతవరకు ఈ మల్టీస్టారర్ కథ ఒక కొలిక్కి రాలేదు. తన సినిమాకి నేషనల్ వైడ్ మార్కెట్ వుంది కనుక ప్రాంతీయ హీరోలతో చేసినా యూనివర్సల్ అప్పీల్ వున్న కథ కావాలని చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఈ కథ బ్రిటిష్ కాలానికి మారింది. రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్ వుండాల్సిందే కనుక ముందుగా గ్రాఫిక్స్ వద్దని అనుకున్నా కానీ అవీ వచ్చి చేరిపోయాయి. ఈపాటికే వర్క్‌షాప్ స్టార్ట్ చేసి హీరోలు ఇద్దరినీ ఎంగేజ్ చేయాలని చూసిన రాజమౌళి తన ప్లాన్స్ అన్నీ డిసెంబర్‌కి వాయిదా వేసుకున్నాడు. ప్రాజెక్ట్ ఓకే అయి చాలా నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు హీరోలు ఇద్దరికీ కథ కూడా చెప్పలేదు.
రాజమౌళి లాంటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వున్న దర్శకుడికి కూడా 'బాహుబలి' లాంటి చిత్రం తీసిన తర్వాత ఎంత ఒత్తిడి వుంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఈ చిత్రం కోసమని చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ 2019 సమ్మర్ వరకు మరే చిత్రానికీ డేట్స్ ఇవ్వడం లేదు. ముందు కమిట్ అయిన చిత్రాల్లో అత్యధిక అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకి తిరిగి ఇచ్చేసారనే టాక్ వుంది.