సినిమాల్లో పోటీ తత్వం ఓ లెక్కలో వుంటుంది. దీని కోసం తెరవెనక రాజకీయాలు కూడా జోరుగానే వుంటాయి. గాయకుడు రామకృష్ణ సినిమా రంగంలోకి రావడంతో కూడా రాజకీయాలు రంజుగా సాగాయని అప్పట్లో చాలా వదంతులు వినవచ్చాయి. ఘంటసాల మరణించిన తరువాత ఆయన గాత్రం లేని లోటును జనం బాగా ఫీలయ్యార. అలాంటి సమయంలో ఘంటసాల పాడే నటులందిరికీ బాలసుబ్రహ్మణ్యం తన మిమిక్రీ చాకచక్యంతో పాటలు పాడడం ప్రారంభించారు.
మామూలుగా పాడితే జనాలకు నచ్చలేదని, వాళ్ల మాడ్యులేషన్ అనుకరిస్తే నచ్చిందని బాలుయే స్వయంగా పలు ఇంటర్వూల్లో చెప్పారు. అదే సమయంలో సుశీల తనకు కొడుకు వరసయ్యే రామకృష్ణను ఇండస్ట్రీలోకి తెచ్చారు. దీనితో రెండు మంచి పరిణామాలు సంభవించాయి. ఒకటి ఓ మంచి గాయకుడు ఇండస్ట్రీకి పరిచయం కావడం. మరొకటి మంచి గాయని చిత్ర బాగా పాపులర్ కావడం.
కానీ మైనస్ ఏమిటంటే, గానకోకిల అనిపించుకున్న సుశీలకు అవకాశాలు తగ్గిపోవడం. దీని వెనుక బాలు రాజకీయం వుందని సినిమారంగంలో టాక్. తనకు పోటీగా రామకృష్ణను తీసుకువచ్చారని, బాలు ఇటు చిత్రను విపరీతంగా ప్రోత్సహించారని వినికిడి. అలాగే ఇళయరాజాతో కలిసి జానకికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. దాంతో అలా అలా సుశీల పాట తెలుగు సినిమాకు చాలా వరకు దూరమైంది. తరువాత తరువాత రామకృష్ణ కూడా తగ్గిపోయారు.
బాలుతో సరిపడక, హీరో కృష్ణ కూడా కొత్తగాయకుడి కోసం అన్వేషించి రాజ్ సీతారా అనే గాయకుడిని పట్టుకువచ్చారు. కొన్నాళ్ల పాటు బాలు-కృష్ణల వైరం అలా సాగినంతకాలం రాజ్ సీతారాం హీరో కృష్ణకు మాత్రం గాత్రం అందిస్తూ వచ్చారు. తరువాత కృష్ణ-బాలులకు ప్యాచప్ అయిపోయాక, రాజ్ సీతారాం కనుమరుగయ్యారు. సినిమా రాజకీయాలు అలాగే వుంటాయి.