ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. హడావిడిగా రామ్ చరణ్, బాబాయ్ పవన్ కల్యాణ్ ని కలిసేందుకు విజయవాడ వచ్చాడు. ఆరోగ్యం బాగోలేదని పరామర్శించడానికి వచ్చాడనుకున్నా కూడా ఒకరోజు లేటే. జనసేనానికి శుక్రవారం వడదెబ్బ తగిలితే రామ్ చరణ్ తీరిగ్గా ఆదివారం వెళ్లి పలకరించి వచ్చాడు. చరణ్ రాక వెనక అసలు కారణం అదేనా అంటే కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జనసేనకు మద్దతు తెలిపేందుకే చరణ్ విజయవాడ వచ్చాడు. అందుకే సేవాదళ్ టీషర్ట్ వేసుకుని కనిపించే ఫొటోలు కూడా ఆదివారమే సోషల్ మీడియాలో కనిపించాయి. పార్టీ ఆఫీస్ లో కూడా అబ్బాయ్ హల్ చల్ చేశాడు. కానీ అసలు విషయం దగ్గరకొచ్చే సరికి తెగింపు చూపలేకపోయాడు చరణ్.
ఈ జనరేషన్ హీరోల తెలివితేటల్ని ప్రదర్శించాడు. జనసేన అనే పేరెత్తకుండా, బాబాయ్ రాజకీయాల్ని టచ్ చేయకుండా ఆయన కోలుకోవాలని, సక్సెస్ కావాలని మాత్రమే ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ప్రచారంలో బాబాయ్ తో కలసి వస్తాడనుకున్న చరణ్ ఆ వెంటనే మాయమయ్యాడు.
వరుణ్ తేజ్, నిహారికకు తప్పదు కాబట్టి తండ్రి నాగబాబు కోసం కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేస్తారో అని భయపడి అల్లుఅర్జున్ 'చెప్పాను బ్రదర్' అనిపించుకున్నాడు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రజారాజ్యం పరాభవ భారం ఇంకా ఈ యువహీరోను వెంటాడుతున్నట్టుంది. అప్పట్లో రైలింజన్లు ఎక్కిచేసిన హడావిడి, ప్రచారంలో చూపించిన హుషారు ఇంకా చరణ్ కి గుర్తుండినట్టే ఉంది.
అందుకే ఈసారి జనసేన విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదు. కేవలం తన బాబాయ్ ని పరామర్శించడానికే అన్నట్టు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు చెర్రీ. కనీసం పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. గాజు గ్లాసు పోస్టర్ పక్కన కూర్చుని ఫొటోలు మాత్రం దిగాడు. ఇలా ఎన్నికల ప్రచారం, జనసేన విషయంలో చరణ్ చాలా తెలివిగానే వ్యవహరించాడు.