ఒక్కో హీరోకు ఒక్కో సినిమా వుంటుంది. ఒక టైమ్ వచ్చినపుడు అలాంటి సినిమా పడుతుంది. హీరో రామ్ చరణ్ కు ఇప్పుడు టైమ్ వచ్చినట్లుంది. ధృవ సినిమాలో తన నటనతో ఓ పరిణితి చూపించిన రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో తన సత్తా ఏమిటో చూపించినట్లయింది.
సుకుమార్ మదిలో ఆ పాత్ర ఎలా వుందో ఏమో కానీ, దానికి ఓ మ్యానరిజమ్, ఓ స్టయిల్, ఓ మాట తీరు, ఇలా అన్నీ సమకూర్చి, పెర్ ఫెక్ట్ చిట్టిబాబును తెరపైకి తెచ్చాడు రామ్ చరణ్. డైలాగ్ మాడ్యులేషన్ కూడా భలేగా వుంది. ‘ఆ పోలీసోడిని గుర్తు పెట్టుకోరా’ అనే డైలాగు చెప్పె స్టయిల్, అక్కడ తల ఎగరవేయడం ఇవన్నీ రామ్ చరణ్ ను పూర్తిగా చిట్టిబాబుగా మారిపోయినట్లు చూపించాయి.
ట్రయిలర్ మొత్తానికి చిట్టిబాబుదే హవా. సమంత కనిపించిన కొద్ది సేపయినా, సరసాలు,సరదాలు బాగానే వున్నాయి. ఇక విలనిజం, టేకింగ్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ఇవన్నీ సుకుమార్ లాంటి పెద్ద డైరక్టర్, దేవీలాంటి మ్యూజిక్ డైరక్టర్, రత్నవేలు లాంటి సినిమాటోగ్రాఫర్ వుంటే ఏ రేంజ్ లో వుంటాయో, ఆ రేంజ్ లోనే వున్నాయి.
మొత్తానికి రంగస్థలం సినిమా మీద అభిమానుల ఆశల్ని, అంచనాలను నిలబెట్టేలా వుంది రంగస్థలం ట్రయిలర్.