రంగస్థలం.. లవ్‌స్టోరీ కాదు థ్రిల్లర్!

మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తన అభిమానులకు సెలబ్రేషన్ మూడ్ అందించి చాలా కాలం గడచిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న రంగస్థలం చిత్రాన్ని చాలా పట్టుదలగా గొప్ప చిత్రంగా రూపొందించే ఉద్దేశంతో కష్టపడి…

మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తన అభిమానులకు సెలబ్రేషన్ మూడ్ అందించి చాలా కాలం గడచిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న రంగస్థలం చిత్రాన్ని చాలా పట్టుదలగా గొప్ప చిత్రంగా రూపొందించే ఉద్దేశంతో కష్టపడి తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించి ఓ టీజర్ కూడా ఇప్పటికే హల్ చల్ చేస్తున్నది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు వినికిడి సమస్య ఉన్న వ్యక్తిగా నటించడం.. ఇవన్నీ పాఠకులందరికీ తెలిసిన విషయాలే.

అయితే టీజర్ ఉన్న తరహా, ఇప్పటిదాకా సినిమా గురించి వ్యాపిస్తున్న కబుర్లను బట్టి.. రంగస్థలం అనేది ఓ మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అవుతుందని అంతా అనుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ అన్ని రకాల సబ్జెక్టులను డీల్ చేయగలిగిన, దర్శకత్వం క్రాఫ్ట్ మీద మంచి పట్టున్న దర్శకుడే అయినప్పటికీ.. లవ్ స్టోరీల మేకింగ్ లో తనదైన ముద్రతో, ఎమోషన్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తారనే పేరుంది. ఆనేపథ్యంలో రామ్ చరణ్ చిత్రం కూడా.. ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అనే టాక్ మాత్రమే ఇప్పటిదాకా స్ప్రెడ్ అవుతోంది.

అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం మెయిన్ జోనర్ లవ్ స్టోరీ కాదని, థ్రిల్లర్ అని చెప్పుకుంటున్నారు. కథలో మెయిన్ పాయింట్ ఇదీ.. రామ్ చరణ్ సోదరుడు హత్యకు గురై ఉంటాడు. హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి రామ్ చరణ్ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాడు.

అసలే వినికిడి సమస్య ఉన్న హీరో. కానీ హంతకుడి ఆచూకీ పట్టుకోవాలి. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ చుట్టూ కథ నడుస్తుందట. చివరికి తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అయ్యాడనేదే స్టోరీ. చూడబోతే.. ఈ సినిమా కథ ధ్రువ చిత్రం కథకు కాస్త దగ్గరగా ఉన్నట్లున్నదనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తోంది.