ఇటీవలి కాలంలో స్పైడర్ సినిమా నిర్మాతలకు వచ్చినంత టెన్షన్ మరో నిర్మాతకు వచ్చి వుండదేమో? 130కోట్ల మేరకు అమ్మకాలు సాగించిన సినిమా. పైగా ఎన్టీఆర్ జై లవకుశ బ్రేక్ ఈవెన్ కావడం అన్న దానికి కాస్త బ్రేక్ వేస్తుందేమో అని భావించిన సినిమా.
అదే సమయంలో ఎన్టీఆర్, మహేష్ బాబు రెండు డిఫరెంట్ స్టేట్ మెంట్ లు ఇచ్చారు సినిమా సమీక్షలపై. మహేష్ కామెంట్ వచ్చిన కొద్ది గంటలకు సినిమా విడుదలయింది. సినిమా తెల్లవారి విడుదలవుతుంది అంటే, ఎర్లీమార్నింగ్ మూడు గంటల నుంచే సోషల్ నెట్ వర్క్ లో స్పైడర్ మీద దాడి ప్రారంభమైంది.
మార్నింగ్ షో పూర్తయ్యేసరికి స్పైడర్ మీద స్ప్రెడ్ అయిన టాక్ ఏ రేంజ్ లో వుందీ అంటే అసలు సమీక్షలకు రేటింగ్ ఒకటో, ఒకటిన్నరో పడుతుందన్నంత అనుమానాలు కలిగాయి. మొత్తం మీద సమీక్షల అంకం పూర్తయింది.
తొలి రోజు కలెక్షన్లు ఎలాగూ వుంటాయి. ఇక మిగిలిన ఆలోచన అంతా ఒకటే. మర్నాడు అంటే గురువారం నాడు సినిమా నిల్చుంటుందా? నిల్చోదా? అన్నదే. దానిని బట్టే స్పైడర్ సినిమా వ్యవహారం ఆధారపడి వుంటుంది అని అందరూ అంచనాకు వచ్చారు.
అయితే అదృష్టవశాత్తూ, రెండో రోజు కూడా కలెక్షన్లు స్టడీగానే వున్నాయని, జిల్లాల నుంచి వార్తలు అందుతున్నాయి. నిజానికి స్పైడర్ మీద వచ్చిన వార్తలు, టాక్ అన్నీ కలిస్తే, సినిమా మర్నాడే సర్రున జారిపోయి వుండాలి. అలా జరగలేదు. దీంతో స్పైడర్ టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.
అయితే అంతమాత్రం చేత స్పైడర్ బయ్యర్లు గట్టెక్కేస్తారని కాదు. ఎందుకంటే ఆంధ్రలో 32కోట్ల రేంజ్ లో అమ్మకాలు జరిపారు. సీడెడ సమస్య లేదు. ఎందుకంటే ఓన్ రిలీజ్. నైజాం అగ్రిమెంట్ ఏమిటన్నది దిల్ రాజుకు, నిర్మాతలకే తెలియాలి.
దసరా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోగలిగితే కొంత వరకు ఫరవాలేదు అన్నదే నిర్మాత ఆలోచన. అలా క్యాష్ చేసుకోవాలంటే, సినిమా మర్నాడే జారిపోకూడదు. గురువారం బాగాన వుంది. శుక్రవారం కూడా కాస్త స్టడీగా వుంటే స్పైడర్ బయ్యర్లకు అదృష్టమే. కానీ అదే రోజు మహానుభావుడు విడుదల వుంది. చూడాలి ఏమవుతుందో?