“కేవలం 1500 రూపాయలు చెల్లించడం.. అత్యాధునిక 4జీ హ్యాండ్ సెట్స్ పొందండి.”
“అది కూడా మూడేళ్ల తర్వాత మీ 1500 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం.”
కేవలం ఈ ముక్కులు మాత్రమే చెప్పింది జియో. అన్నీ ఫ్రీ అంటూ ఊరించింది. తీరా లక్షల సంఖ్యలో బుకింగ్స్ జరిగిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా బయటపెట్టింది.
కేవలం 1500 పెట్టి జియో 4జీ కొనుక్కుంటే సరిపోదు. ప్రతి ఏటా దానికి 1500 రూపాయలు పెట్టి రీచార్జ్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే 4జీ జియో ఫోన్ పనిచేస్తుంది. కొత్తగా ప్రకటించిన టెర్మ్స్ అండ్ కండిషన్స్ లో జియో పెట్టిన షరతు ఇది.
జియో ఫోన్ కోసం మనం వెచ్చించిన 1500 రూపాయలు తిరిగి రావాలంటే.. ఫోన్ ను కనీసం మూడేళ్లు వాడాలి. అలా వాడాలంటే ఏడాదికి కనీసం 1500 రూపాయలు రీచార్జ్ చేయించుకొని మూడేళ్లకు 4500 రూపాయలు సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే ఫోన్ కోసం మనం పెట్టిన డబ్బును వాపసు ఇస్తారు. అంటే మన 1500 కావాలంటే 4500 ఖర్చు చేయాలన్నమాట.
ఈ కొత్త మెలికతో వినియోగదారులకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బుక్ చేసిన ఫోన్ ను సొంతం చేసుకుందామంటే బ్యాలెన్స్ మొత్తం 1000 రూపాయలు కట్టాలి. వదులుకుందామనుకుంటే ఇప్పటికే కట్టిన 500 రూపాయలు తిరిగి రావు. పోనీ వెయ్యి కట్టి ఫోన్ తీసుకుందామంటే మూడేళ్లలో 4500 సమర్పించుకోవాలి.
ఇప్పటికే ఫోన్ తో, టీవీని అనుసంధానించే కేబుల్ ను కట్ చేసింది జియో. అదనంగా కొంత చెల్లించి ఆ కేబుల్ కొనుక్కోవాలి. అంతేకాదు వైఫై హాట్ స్పాట్ కూడా లేదు. నెట్ ఫ్రీ అనడంతో… ఒక ఫోన్ కొని హాట్ స్పాట్ తో ఆనందిద్దాము అనుకున్నవారికి తీవ్ర నిరాశ మిగిలింది. ఇప్పుడు ఈ రీచార్జ్ ల కండిషన్లు పెడుతోంది. ఫోన్ చేతికొచ్చిన తర్వాత ఇంకెన్ని మెలికలు పెడుతుందో ఏమో. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఒకవేళ మీకు ఈ కండిషన్లు నచ్చక ఏడాదిలోపే ఫోన్ ను వెనక్కి ఇచ్చేయాలనుకుంటే మీకు ఒక్క పైసా కూడా చేతికి రాదు.