తెలంగాణ భాజపాకు కొత్త కళ వస్తున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణలోని అదికారపక్షానికి ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, భాజపా. ఈరెండింటినీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ఓడించారు. కానీ అతి తక్కువ కాలంలోనే మళ్లీ ఊపిరి అందింది. సిఎమ్ కేసిఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా కావచ్చు, తీసుకుంటానంటూ చెప్పిన విషయాల కారణంగా కావచ్చు జనం కాస్త ఝలక్ ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో భాజపా ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రిపదవి దక్కింది. సమైక్య ఆంధ్రలో భాజపాకు ఓ సమస్య వుండేది. వెంకయ్య నాయుడు ఆధిపత్యంలో భాజపాలో కూడా కమ్మ సామాజిక వర్గ డామినేషన్ వుండేది. తెలంగాణ ప్రాంతంలో రెడ్లు పార్టీలో వున్నా, అధిష్టానం దగ్గర వెంకయ్య మాటే చెల్లుబాటు అయ్యేది. అలాంటి నేపథ్యంలోనే ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం పుట్టుకువచ్చింది.
కేంద్రంలో విద్యాసాగరరావు, దత్తాత్రేయ లాంటి వాళ్లకు మంత్రిపదవులు వచ్చాయి కానీ, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం రాలేదు. ఇటీవల తెలంగాణలో అధికారంలో వున్న వెలమలు, రెడ్లు కూడా చేతులు కలిపారు. దానివల్ల తెరాస కూడా రెడ్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. వారికి సీట్లు అధికంగా కేటాయించింది.
ఇప్పుడు భాజపా కూడా అందుకే స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది. వెంకయ్య నాయుడు ఎలాగూ అడ్డంపడేది లేదు. ఆయన ఉపరాష్ట్రపతి లాంటి గౌరవపదవిలోకి వెళ్లారు. ఇలాంటి టైమ్ లో రెడ్లను ఎంకరేజ్ చేయడం ద్వారా తెలంగాణలో సామాజిక విభజన రాజకీయానికి భాజపా శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది.
అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది.