Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘రౌడీ’పై భిన్నాభిప్రాయాలు

‘రౌడీ’పై భిన్నాభిప్రాయాలు

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ యూత్ ఐకాన్. అందులో సందేహంలేదు. విపరీతమైన యూత్ ఫాలోయింగ్ వుంది. అందులోనూ డౌట్ లేదు. కానీ ఈ నేపథ్యంలో విజయ్ వ్యవహారశైలిపై మాత్రం ఇండస్ట్రీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎదిగిన కొద్దీ ఒదిగి వుండడం అన్నదికాదు, ఆదర్శంగా వుండగలగడం. లేదా పద్దతిగా వుండగలగడం అవసరం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ తన ఫ్యాన్స్ తో ఓ గ్రూప్ తయారుచేసకోవచ్చు. లేదా ఓ వ్యాపారం చేయవచ్చు కానీ, దానికోసం ‘రౌడీ’ అనే పదజాలం వాడడంపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే యువతరం రకరకాల ప్రభావాలకు గురవుతోంది. కొంతమంది మంచి దోవన నడుస్తుంటే, మరి కొంతమంది రకరకాల ప్రభావాలకు, ప్రలోభాలకు గురవుతున్నారు.

అర్జున్ రెడ్డి టైమ్ లో ‘మా...’ అంటూ తిట్టును పదే పదే స్టేజ్ మీదే చెప్పి విజయ్ కొంతమంది కుర్రగ్యాంగ్ చేత చప్పట్లు కొట్టించుకుంటే కొట్టించుకుని వుండొచ్చు కానీ, దానిపట్ల చాల మంది ఏమిటిదంతా? మరీ అతి వ్యవహారంగా వుంది అని అనుకున్నమాట వాస్తవం. అయితే అర్జున్ రెడ్డి హిట్ కావడంతో ఇంక ఎవ్వరూ మాట్లాడలేదు.

ఇప్పుడు తన అపెరల్స్ వ్యాపారం కోసం రౌడీ అనే బ్రాండ్ ను వాడడం, గుండెల మీద రౌడీ అని పెద్దగా ముద్రవేసి మరీ వుండడం, కుర్రాళ్లను ‘రౌడీస్’ అని సంబోధించడం వంటివి అన్నీ సరైన చర్యలు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇండియన్ పీనల్ కోడ్ లో ‘రౌడీషీట్’ అనేది వుండనే వుంది. రౌడీ షీట్ తెరవబడిన కుర్రాళ్లకు సరైన భవిష్యత్ వుండదు. దాన్నిబట్టి రౌడీ అనేది పాజిటివ్ వర్డ్ కాదు అని క్లియర్ గా తెలుస్తుంది.

దానికి బదులు రఫ్ అనో రఫ్ గ్యాంగ్ అనో ఇలాంటి అనేక పద ప్రయోగాలు అనేకం చేసుకోవచ్చు. యంగ్ హీరోలు అనేకమంది వున్నారు. వాళ్లంతా కూడా వ్యాపారాలు, పెట్టుబడులు చేసుకుంటున్నారు. కానీ ఎవ్వరూ బీభత్సంగా హడావుడి చేయడం లేదు. వీలయినంత పొలైట్ గా పనులు చేసుకుంటున్నారు. పబ్లిక్ లోకి వస్తే వీలయినంత డిప్లమసీ తో వుంటున్నారు. మరి విజయ్ షార్ట్ కట్ లో క్రేజ్ తెచ్చే రూట్ ను ఎందుకు ఎన్నుకున్నాడో?

ఇదంతా టిపికల్ హైదరాబాదీ స్టయిల్ అని, ఇక్కడి యూత్ కు ఇదే నచ్చుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకే విజయ్ కు అంత క్రేజ్ వచ్చిందని అంటున్నారు. ఆ క్రేజ్ ను వాడుకుంటూ యూత్ ను సరైన ట్రాక్ లోకి వెళ్లేలా చేస్తే మంచి పేరు వస్తుందని, ఇలా టెంపరరీ క్రేజ్ కోసం రౌడీ.. లాంటి పదాలు వాడడం సరికాదని అంటున్నారు మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?