ఆర్ ఎక్స్ కు డబ్బులే డబ్బులు

ఆర్ ఎక్స్ 100 సినిమా ప్రీమియర్ షో పూర్తయిన తరువాత చూసిన వాళ్లలో రెండు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఈ సినిమా కుమ్మేస్తుంది కలెక్షన్లు అనే వారు కొందరు. అబ్బే.,.ఆడదు..మహా అయితే మల్టీ…

ఆర్ ఎక్స్ 100 సినిమా ప్రీమియర్ షో పూర్తయిన తరువాత చూసిన వాళ్లలో రెండు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఈ సినిమా కుమ్మేస్తుంది కలెక్షన్లు అనే వారు కొందరు. అబ్బే.,.ఆడదు..మహా అయితే మల్టీ ఫ్లెక్స్ లు అనేవారు మరి కొందరు. కానీ ఇప్పుడు కుమ్ముడే నిజమయింది. ఆ కుమ్ముడు ముందు కాస్త బాగుంది అని టాక్ వచ్చిన చినబాబు కూడా నిలవలేకపోతోంది.

తొలివారంలో అయిదు కోట్లకు పైగా షేర్  అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయడం అంటే ఓ చిన్న సినిమాకు చాలా పెద్ద ఫీట్. ఆర్ ఎక్స్ 100 కు అయిన ఖర్చు గట్టిగా రెండున్నర కోట్లు మాత్రమే. హీరో రెమ్యూనిరేషన్ లేదు కాబట్టి. హీరో చిన్నాన్ననే ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఆయనకు డబ్బులే డబ్బులు.

ఎందుకంటే సినిమాను ఓవర్ సీస్, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ గ్యారంటీ (ఎంజి) లెక్కన ఇచ్చారు. ఆపైన వచ్చిన ఓవర్ ఫ్లోస్ సగం..సగం.

విడుదలయిన ఫస్ట్ వీకెండ్ లోనే ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ అయిపోయాయి. పైగా ఇక్కడ ఇంకో అదృష్టం ఏమిటంటే, ఫుల్స్ ఎక్కువగా వుండడం. దీనివల్ల ఓవర్ ఫ్లోస్ లెక్క క్లియర్ గా వుంటుంది. వచ్చేవారం రెండు సినిమాలు వున్నాయి. కానీ మరీ ఈ కలెక్షన్లకు బ్రేక్ వేసేంత వుండకపోవచ్చు.

అందువల్ల నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి అంతకు అంతా వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు శాటిలైట్, డిజిటల్ రైట్స్ నిర్మాత దగ్గరే వున్నాయి. వాటి  బేరాలు సాగుతున్నాయి. నిర్మాత అయిదు నుంచి ఆరు కోట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం నాలుగు కోట్లు రాబట్టుకోగలిగినా,  ఓ చిన్న ప్రాజెక్టు మీద ఆరు కోట్ల వరకు లాభం వచ్చినట్లు.

కొసమెరుపు ఏమిటంటే…ఆ మధ్య వందకోట్ల బడ్జెట్ పెట్టి, నానా టెన్షన్లు పడి,నిర్మించిన ఓ భారీ బడా బ్లాక్ బస్టర్ నిర్మాతకు కూడా ఇంత మిగిలలేదు అని వినికిడి.

ఆర్ ఎక్స్ 100 ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

నైజాం………..2.42
సీడెడ్………..0.58
వైజాగ్………..0.61
ఈస్ట్………….0.42
వెస్ట్………….0.31
కృష్ణ…………0.34
గుంటూరు…..0.36
నెల్లూరు…….0.11