మహా సంప్రోక్షణం పేరిట తిరుమల వేంకటనాధుని ఆలయాన్ని శుభ్రం చేయడానికి టీటీడీ బోర్డు నిర్ణయించింది బాగానే ఉంది. కానీ.. దీనికి సంబంధించి.. కొంత భిన్నమైన వార్తలు బహుముఖాలుగా ఉన్న మీడియాలో వస్తున్నాయి. ఇంతకూ తిరుమల శ్రీవారి ఆలయానికి మహా సంప్రోక్షణ నిర్వహించే రోజుల్లో.. ఆలయంలోకి భక్తుల ప్రవేశం మీద మాత్రమే నిషేధం విధిస్తున్నారా? లేదా, తిరుమలకు భక్తులు రావడం మీదనే నిషేధాజ్ఞలు పెట్టేశారా? అనేది స్పష్టత రావడం లేదు.
తిరుమలకు భక్తులను అనుమతించేది లేదు అని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ ప్రకటనే నిజమైతే, తిరుమల గిరులకు భక్తులు రావడాన్నే నిషేధించడానికి టీటీడీ ఎవరు? తిరుమల కొండలు యావత్తూ వారి జాగీరా? అనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. తిరుమలలో కేవలం టీటీడీ ఆలయాలు మాత్రమే కాదు. హిందూధర్మ పరిక్షణకు కట్టుబడిన మఠాలు, జాపాలి వంటి ప్రఖ్యాత ఆలయాలు, ఆశ్రమాలు అనేకం ఉన్నాయి. కేవలం శ్రీవారి దర్శనానికే కాకపోయినా.. ఈ ఆలయాలకు, మఠాలకు కూడా పెద్ద సంఖ్యలో నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. తిరుమలకే భక్తులను రానివ్వం అన్నట్లుగా నిషేధాజ్ఞలు ఉండేట్లయితే.. అది ఎలా చెల్లుబబాటు అవుతంది అనేది ప్రజల సందేహం. ఈ విషయంలో ఒకవేళ ఆ రకంగా వచ్చిన కొన్ని వార్తలు తప్పుడు కథనాలు లేదా , టీటీడీ నిర్ణయానికి వక్రీకరణలు అయితే గనుక.. వాటి విషయంలో స్పష్టత ఇచ్చి శ్రీవారి ఆలయానికి మాత్రమే భక్తులను అనుతించబోమని.. తిరుమలకు ఎవరైనా రావచ్చునని బోర్డు స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అలాగే, టీటీడీ బోర్డు ఈ మహా సంప్రోక్షణ విషయంలో మరి కొన్ని అంశాల్లోనూ స్పష్టత ఇవ్వాలి. కేవలం వేంకటేశ్వరుని ఆలయానికి మాత్రమే మహా సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు గనుక.. అది వినా టీటీడీ ఆధ్వర్యంలోని తతిమ్మా ఆలయాలు అన్నింటినీ.. యధావిధిగా భక్తులకోసం తెరిచిఉంచుతామని ప్రకటించాలి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలోనే.. వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, ఇతర అనేక ఆలయాలు.. భక్తులు సందర్శిస్తుంటారు. మహా సంప్రోక్షణ రోజుల్లో కూడా వాటికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా.. ఆ విషయాన్ని భక్తకోటికి స్పష్టంగా తెలియజెప్పాలి. అంతే తప్ప యావత్ తిరుమల గిరులు.. తమ సొంత ఆస్తి అన్నట్లుగా టీటీడీ బోర్డు యథేచ్ఛగా వ్యవహరించడం తగదని పలువురు భావిస్తున్నారు.