బాహుబలి..రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా బ్లాక్ బస్టర్. తెలుగు సినిమా చరిత్రలో ఊహించలేని, మళ్లీ వస్తాయో రానంత కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా. దీంతో ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం..బాహుబలి 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను కూడా అయిదువందల కోట్ల కలెక్షన్లు దాటించాలి. కానీ సరిపోదు..ఎందుకంటే ఈ సారి సినిమా హక్కుల అమ్మకాలే మూడు వందల కోట్లకు చేరుకునేలా వున్నాయి. ఇప్పటికే రాజమౌళి సన్నిహితుడు బోణీ కొట్టారు. కర్ణాటకు భారీ రేటుతో హక్కులు తీసుకున్నారు. అందువల్ల రాజమౌళి మీద మరింత భారం పడింది. బాహుబలి 2ను చాల పకడ్బందీగా, తొలిభాగంపై వచ్చిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని మరీ రూపొందించాల్సి వుంది. ఆ కార్యక్రమం కొన్ని రోజుల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు జోరందుకుంది.
గడచిన కొద్ది రోజులుగా రాజమౌళి కుటుంబం బాహుబలి కథా చర్చల్లో నిమగ్నమై వుంది. ఆశ్చర్యం లేదు. రాజమౌళి కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. పైగా ప్రతి ఒక్కరు ఏదో బాధ్యత భుజాన వేసుకుంటారు. సినిమా టైటిల్ కార్డ్ ల్లో చోటు చేసుకుంటారు. ఇప్పుడు రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తీక్, తండ్రి విజయేంద్ర ప్రసాద్, అన్న కీరవాణి, ఆయన భార్య వల్లీ, సదా రాజమౌళి దగ్గర వుండే సహాయ దర్శకుడు త్రికోటి, కలిసి నిత్యం కథా చర్చలు సాగిస్తున్నారు. ఒక్కో పార్ట్ నెరేషన్, డిస్కషన్, ఆ పై లాకింగ్..ఇలా సాగుతున్నాయి వ్యవహారాలు. వీలయినంత త్వరగా స్క్రిప్ట్ లాక్ చేసి, సెట్ మీదకు వెళ్లాలనేది వీరి అయిడియా. అందుకే చాలా ఎక్కువ టైమ్ కేటాయించి చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికి కొన్ని సీన్లు లాక్ చేసారని బోగట్టా.
ఇంతలా కిందా మీదా పడతాడు కాబట్టే, రాజమౌళి తన అవుట్ పుట్ ను అందరికీ నచ్చేలా చేయగలుగుతాడేమో?