షార్జా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలలో భారతీయ మహిళల మాన ప్రాణాలు ఎంత విలవిల్లాడుతున్నాయో కళ్లకు కట్టిందా మహిళ… కొన్నేళ్ల క్రితం… తనను సూపర్మార్కెట్లో జాబ్ అనే పేరుతో షార్జాకు తరలించిన ముఠా… ఆ తర్వాత తనను భయంకరమైన వ్యభిచార రొంపిలోకి దించారని న్యాయస్థానానికి తెలిపింది.
అనంతరం దేశం కాని దేశంలో ఎవరూ తెలియని మనుషుల మధ్య తనను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందీ, వాళ్ల నుంచి తప్పించుకోవడానికి తను ఎన్ని కష్టాలు పడిందీ చెప్పుకున్న ఆ కేరళ మహిళ కధ విని చలించిపోయింది కేరళ హైకోర్టు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న బాధితురాలు… తన కేసు విచారించడానికి ఈ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.
ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్న నిందితులలో సౌదాబీవీ అనే కేరళ మహిళతో సహా మరికొందరు నిందితులు విదేశాల్లో ఉన్న నేపధ్యంలో వారిని పట్టుకోవడంలో కేరళ పోలీసులకు సహకరించడంతో పాటు, ఉద్యోగాల ఆశతో అమాయకంగా సెక్స్ రాకెట్లో చిక్కుకుని విదేశాలలో కుములుతున్న భారతీయ మహిళలను గుర్తించి రక్షించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలుపాల్సిందిగా కేరళ హైకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది.