వయసు 50 దాటినా ఇప్పటికీ చెక్కుచెదరని స్టామినా. ఒంటినిండా కండలే. మనిషి దిట్టంగా కనిపిస్తాడు. అందరూ కండలవీరుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ ఇవన్నీ పైకి చూడ్డానికే. లోపల మాత్రం ఓ పాడు రోగం సల్మాన్ ఖాన్ ను పట్టిపీడిస్తోంది. ఆ విషయాన్ని సల్లూ భాయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడున్నరేళ్లుగా ఆ రోగంతో బాధపడుతున్నాడు సల్మాన్ ఖాన్. దాని పేరే “ట్రై జెమినల్ న్యూరాల్జియా”. ఇదొక నరాల అస్తవ్యస్థతకు సంబంధించిన రోగం. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బిపోతాయి. తలనొప్పి ఎక్కువైపోతుంది. ఇదే దీని ప్రధాన లక్షణం.
ఈ వ్యాధితో ఏడున్నరేళ్లుగా ఇబ్బంది పడుతున్నట్టు సల్మాన్ స్వయంగా ప్రకటించాడు. తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ వెళ్లిన సల్మాన్ అక్కడ ఈ విషయాల్ని మీడియాకు వివరించాడు. తలనొప్పి ఎంత వేధిస్తున్నప్పటికీ అభిమానుల్ని మనసులో తలుచుకొని సినిమాలు చేస్తుంటానని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
అన్నట్టు ఈ సమస్యకు ట్రీట్ మెంట్ కోసం ఓసారి అమెరికా కూడా వెళ్లొచ్చాడు సల్మాన్. దాదాపు 7-8 నెలల పాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో తిరిగొచ్చేశాడు.