సంక్రాంతి పండుగ మంగళవారం మొదలవుతుంది కనుక హ్యాపీగా శుక్రవారం సినిమా విడుదల చేసుకోవడానికి కుదుర్తుంది. కానీ ఆ శుక్రవారం పట్ల ఎవరూ సుముఖంగా లేకపోవడమే ఆశ్చర్యకరం. మహేష్‌బాబు జనవరి 10న '1 నేనొక్కడినే' వుంటే, అదే రోజున త్రివిక్రమ్‌కి 'అజ్ఞాతవాసి' వచ్చింది. అందుకే ఆ డేట్ మీద ఇటు 'సరిలేరు నీకెవ్వరు' కానీ, అటు 'అల వైకుంఠపురములో' కానీ సుముఖంగా లేరు.
అలాగే ఈ రెండు చిత్రాలలో ఏది ముందుగా రావాలనే దానిపై కూడా సిగపట్లు సాగుతున్నాయి. సంక్రాంతికి ముందొచ్చిన సినిమాలు పల్టీకొట్టి, లేట్‌గా వచ్చిన యావరేజ్ చిత్రాలు కూడా సత్ఫలితాలు సాధిస్తూ వుండడంతో సెకండ్ రావాలనే కోరిక ఈ రెండు చిత్రాల నిర్మాతలు, హీరోలకి వుంది. రెండూ కూడా బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా పెద్ద రేంజ్ సినిమాలయినా కానీ సిల్లీ సంక్రాంతి సెంటిమెంట్లతో ఇరువురూ జంకుతున్నారు.
సాధారణంగా కంటెంట్ బాగున్న సినిమా ఎలాగయినా ఆడేస్తుంది. తేదీతో పని లేకుండా కంటెంట్ వున్న చిత్రానికి రేంజ్ వచ్చేస్తుంది. మరి ఎందుకని ఇరువర్గాల వారు జంకుతున్నారో అర్థంకావడం లేదు. ఇది సదరు సినిమాల కంటెంట్ మీద అనుమానం లేదా అవతలి వారి సినిమా తమకంటే బాగుంటుందనే భయం అనుకోవచ్చు. చూస్తోంటే సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ హ్యాపీగా టైమ్‌కి రిలీజ్ అయి లాభపడేలా వుంది.