రాజీవ్ మీనన్.. తన దర్శకత్వ కెరీయర్ లో చేసినవి జస్ట్ మూడు సినిమాలు. సినిమాటోగ్రాఫర్ గా చేసినవి మహా అయితే ఓ ఆరు. కానీ ఆయన ప్రేక్షకులకు తెలియకుండా చేసే పనులు ఇన్నీ అన్నీకావు. ఓపక్క ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్. మరోపక్క అడ్వర్ టైజ్ మెంట్లు, ఇంకోపక్క విజిటింగ్ ఫ్రొఫెసర్ గా క్లాసులు. ఇలా చాలా అంటే చాలా వున్నాయి.
రాజీవ్ మీనన్ అంటే మెరుపుకలలు.. ప్రియురాలు పిలిచింది. ఆ సినిమాల్లో ఆయన అందించిన సినిమాటోగ్రఫీ కానీ, ఆ సినిమాల్లోని పాటలు కానీ ఇప్పటికీ మరుపురావు. ఆఖరుగా ఆయన సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన సినిమా మణిరత్నం కడలి. ఆ విధంగా చాలా అంటే చాలా సెలెక్టివ్ గా పని చేసుకుంటూ వస్తున్న రాజీవ్ మీనన్ లేటెస్ట్ సినిమా సర్వం తాళమయం. ఈ సినిమాను తెలుగునాట ఈ వారంలో విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా ఆయనతో కాస్సేపు మాట్లాడితే..
*దేశంలో ఏ భాషతోనూ సమస్య రానిది తాళం ఒక్కటే. సంగీతానికి భాషా జ్ఞానం కావాలేమో? తాళానికి అది అవసరం లేదు.
*మృదంగం తయారుచేసే వ్యక్తి మృదంగ విద్వాన్ కాలేడా? అన్న ఓ ఆలోచనలోంచి ఈ కథ పుట్టింది. ఈ సందర్భంగా కొద్దిగా వర్ణ వ్యవస్థ గురించి కూడా డిస్కస్ చేసాం.
*సినిమా అంటే వాణిజ్య పరంగా క్లిక్ కావాలి అని నాకు తెలుసు. ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇలాంటి కథ చెప్పడం కాస్త రిస్కే అని తెలుసు. అందుకే నేను, నా భార్య ఈ పనికి పూనుకున్నాం. ఇక్కడ ఈ రంగంలో సంపాదించిన సొమ్ము ఈ రంగానికే వినియోగిస్తున్నాం అనే భావంతో సినిమా చేసాం.
*తక్కువ సినిమాలు చేయడానికైనా, తక్కువ సినిమాలు అందించడానికైనా కారణం ఒక్కటే, బహుముఖ వ్యవహారాలు పెట్టుకోవడం. అందువల్లే ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నాను. ఇకపై చేయాలనే వుంది.
*ఈ సినిమాతో మళ్లీ రెహమాన్ ఎర్లీ స్టేజ్ లో చేసిన మెలోడీలు వింటారు. ఆయన చాలా మనసుపెట్టి మరీ ఈ సినిమా చేసారు.
*విశ్వానాధ్ గారికి ఈ సినిమా చూపించాను. ఆయన ఎంత ఇష్టపడ్డారో మాటల్లో చెప్పలేను.
*కాలమాన పరిస్థితులు, అభిరుచులు మారుతున్నాయి. శంకరాభరణం ఇప్పుడు తీస్తే ఆదరిస్తారో, ఆదరించరో అన్నది చెప్పేంత దృష్టి నాకు లేదు. కానీ మనకు, మన మనసుకు నచ్చింది, మనం స్పందించినది జనాలకు అందించాలి అని మాత్రం అనుకుంటారు. మన కంట్రిబ్యూషన్ అంటూ కొంత వుండాలి కదా?
*తెలుగు ప్రేక్షకులు ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలను, స్ట్రయిట్ పెద్ద సినిమాల కన్నా విజయవంతం చేసారు. అదే నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.