బాలీవుడ్ ఇండస్ట్రీలోని నలభై మంది ప్రముఖులకు భద్రతను కుదించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తమ రాష్ట్ర పరిధిలో వారందరి భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని వెనక్కు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది కొరతతోనే ఈ చర్యలు చేపట్టినట్టుగా ముంబై పోలీసులు వివరణ ఇచ్చారు. ఏకంగా నలభై మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇలా ఒకేసారి భద్రతను తగ్గించడం.. ఆ విధుల్లో ఉన్న పోలీసులను డిపార్ట్ మెంట్ లోకి పిలిపించేయడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకించి ఈ జాబితాలో ఆమిర్ ఖాన్ , షారూక్ ఖాన్ లు ఉండటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా ఆమిర్ ను కేంద్ర ప్రభుత్వం ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు బ్రాండ్ అంబాసిడర్ స్థానం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దేశంలో అసహనం పెరిగిపోయిందని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన ఆమిర్ కు అతిథి దేవోభవ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ కు ఉండే అర్హత సహజంగానే పోతుంది. దీంతో ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకున్నట్టుగా ఉంది. తనను అంబాసిడర్ స్థానం నుంచి తొలగించడాన్ని ఆమిర్ స్వాగతించాడు. ఇప్పుడు మళ్లీ భద్రత తొలగింపు వ్యవహారంలో కూడా ఆమిర్ పేరు వార్తల్లోకి వచ్చింది. అసహనం గురించి ఆమిర్ లాంటి అభిప్రాయాన్నే వ్యక్త పరిచిన షారూక్ కు కూడా భద్రత కుదించారు. షారూక్ కు చాలా సంవత్సరాల నుంచే ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇకపై అవి ఉండవు.
భద్రత తొలగించిన జాబితాలో చాలా మందే ఉన్నా.. మరికొందరి సెలబ్రిటీల విషయంలో మహరాష్ట్ర ప్రభుత్వం తొలగింపు జోలికి వెళ్లలేదు. అమితాబ్, అక్షయ్ కుమార్, లతా మంగేష్కర్ వంటి వాళ్లకు భద్రతా సిబ్బందిని కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన భావాన్ని చూపుతున్న ఆమిర్ , షారూక్ లకు ఇలా భద్రత తొలగించడం.. కూడా అసహనమే అనే వ్యాఖ్యలు వినిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులోనూ మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి.. ఈ వాడి పెరిగే అవకాశం ఉంది. నిజంగానే వారికి భద్రత అనవసరమైనా.. ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా… అసహనం విమర్శలు తప్పకపోవచ్చు!