నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో దర్శకుడు శేఖర్ కమ్ముల హర్ట్ అయ్యాడు. కాదు.. కాదు ఆగ్రహించాడు కూడా. సాధారణంగా కూల్ గా వుండే శేఖర్ కమ్ముల, కాస్త గట్టిగానే సమాధానం చెప్పాడు. వాస్తవానికి శేఖర్ కమ్ముల పేరు అనిపించేలా శ్రీరెడ్డి చాలా తెలివిగా పోస్ట్ పెట్టారు.
అంటే సైబర్ క్రయిమ్ లేదా ఇతర లీగల్ ప్రొసీడింగ్స్ కు కాస్త వెసులుబాటు తన వైపు వుంచుకునేలా. కానీ అది చదివిన వారందరికీ అర్థం అయిపోతుంది. అయితే సమస్య శ్రీరెడ్డి పోస్ట్ తో కన్నా యూట్యూబ్ చానెళ్లతో వచ్చింది. డైరక్ట్ గా శేఖర్ కమ్ముల ఫొటో పెట్టి మరీ నానా విడియోలు డిజైన్ చేసారు. దీంతో శేఖర్ కమ్ముల బయటకు వచ్చారు.
''…ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి, నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది.
ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.
స్త్రీల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తిలేదు.
ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను…''
అంటూ శేఖర్ కమ్ముల ప్రకటించారు. అక్కడితో ఆగడం లేదని, బహిరంగంగా మీడియా ముందుకు రావడం, సైబర్ క్రయిమ్, లీగల్ నోటీసు వంటి చర్యలు తీసుకునే ప్రాసెస్ ను శేఖర్ కమ్ముల ప్రారంభించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. ఇదిలా వుంటే మరి కొంతమంది సినిమా జనాలు కూడా ఇదే బాటలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.