నాగార్జున-నాని మల్టీస్టారర్ చకచకా సిద్ధమైపోతోంది. వెంకటేశ్-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ కూడా వచ్చేనెల నుంచి పట్టాలపైకి వచ్చేస్తోంది. కానీ నితిన్-శర్వానంద్ మల్టీస్టారర్ మూవీ మాత్రం ఇప్పట్లో తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. చూస్తుంటే.. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు నుంచి శర్వానంద్ తప్పుకునేలా ఉన్నాడు.
ఇద్దరు హీరోలతో సునిశితమైన భావోద్వేగాలతో, ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయడానికి రెడీ అయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ ప్రాజెక్టుకు దాగుడుమూతలు అనే పేరు ఫిక్స్ చేశాడు. నిర్మాతగా దిల్ రాజు కూడా ఫిక్స్ అయ్యాడు. ఓ హీరోగా నితిన్ ను తీసుకున్నారు. నితిన్ కంటే ముందే మరో హీరోగా శర్వానంద్ ను ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు శర్వా పునరాలోచనలో పడ్డాడు.
శర్వా ఎందుకు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించడం లేదనేది అందరి డౌట్. కథ అతడికి నచ్చలేదా, లేక ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల టైమ్ కేటాయించలేకపోతున్నాడా అనేది తేలాల్సి ఉంది. కథ నచ్చకపోతే ముందే డ్రాప్ అయిపోతాడు. కేవలం ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే దాగుడుమూతలకు శర్వానంద్ దూరమైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ హీరో హను రాఘవపూడి, సుధీర్ వర్మ దర్శకత్వాల్లో ప్యారలల్ గా 2 సినిమాలు చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దాగుడుమూతలు గురించి ఆలోచిస్తాడు.