శ్రీమంతుడు, జనతాగ్యారేజ్.. భరత్ అనే నేను ఇలాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరక్టర్ కొరటాల శివ ఏడాది కాలంగా అలా ఖాళీగా వుండిపోయారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఓకె అనడం తప్పిదమేమో? మెగాస్టార్ సైరా ఇదిగో.. అదిగో అంటూ 'సాగు'తోంది. పాపం, కొరటాల శివ రెడీగా వున్న బౌండ్ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతూ అలా వుండిపోయారు.
నిజానికి తన వెసులుబాటు తెలిసిన మెగాస్టార్ ప్రారంభంలోనే మరో సినిమా చేసుకుని రమ్మని చెప్పివుంటే కొరటాల శివ ఈపాటి మరో సినిమా తీసి బయటకు పంపి వుండేవారు. కానీ మన హీరోలు అలా అనరు కదా? దర్శకులకు కమిట్ మెంట్లు ఇచ్చి, అడ్వాన్స్ ఇచ్చి, ఆపీసుల్లో బందీలను చేసేస్తారు.
భరత్ అనే నేను సినిమా విడుదలై ఏడాది అయిపోయింది. చిరంజీవి సినిమా స్టార్ట్ పూర్తిస్థాయిలో సెట్ మీదకు వెళ్లడానికి మరో ఆరునెలలు అయినా పడుతుంది. ఆ పైన సినిమా రెడీ అయి విడుదల కావడానికి ఇంకో ఆరునెలలు. అంటే మరో ఏడాదికి కానీ, కొరటాల శివ ఇవ్వబోయే సినిమా జనాల కళ్లముందుకు రాదు.
కొరటాల అయినా ఏం చేయగలరు? ఒకసారి ఒప్పుకున్నాక తప్పదు కదా?