సైజ్ జీరో అంటూ వెరైటీ పోస్టర్లు విడుదల చేయడం ప్రారంభించింది పివిపి సంస్థ. ఆ బొమ్మ, ఈ బొమ్మ చూపించి, వున్నట్లుండి, మాంచి లావుగా వున్న అనుష్క చిత్రాలు వరుసగా రెండు విడుదల చేసారు. వాటిల్లో అనుష్కను చూసిన జనం బెంబేలెత్తారు. అందరికీ లడ్డూబాబు గుర్తుకు వచ్చింది.
ఈ ఫీడ్ బ్యాక్ ప్రొడక్షన్ యూనిట్ వరకు వెళ్లినట్లుంది..వెంటనే ఆ టైపు చిత్రాలు విడుదల చేయడం ఆపేసారు. సన్నగా, మెరుపు తీగలా, అందంగా వున్న అనుష్క చిత్రాలు వదలడం ప్రారంభించారు. ప్రేక్షకులు సినిమా అందంగా వుండాలని కోరుకుంటారు. అందుకే సినిమా కలర్ ఫుల్ గా వుండాలని చూస్తారు దర్శక, నిర్మాతలు.
అందునా హీరో కాస్త అటు ఇటుగా వున్నా ఫరవాలేదు కానీ, అమ్మాయి అందంగా లేకుంటే మనవాళ్లకు నచ్చదు. అందువల్లే హీరోలు చేసిన ప్రయోగాలు హీరోయిన్లతో చేయించడం కష్టం. పైగా సినిమాలో అనుష్క ఎంత సేపు లావుగా కనిపిస్తుందో, ఎంతసేపు సన్నంగా కనిపిస్తుందో తెలియదు.
కానీ ఈ లావు స్టిల్స్ చూస్తే మాత్రం జనం ఇలాంటి అనుష్కను ఏం చూస్తాం అని థియేటర్ కు దూరంగా వుండే ప్రమాదం వుంది. బహుశా ఇవన్నీ తెలిసి వచ్చి వుంటాయి. అందుకే ఇప్పుడు అందమైన స్టిల్స్ బయటకు వస్తున్నాయి.