ఒకే ఒక వ్యవహారం దాదాపు ఏడాది నుంచి మలయాళీ చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక నటిపై జరిగిన లైంగిక దాడి సంచలన అంశంగా మారి.. మలయాళీ స్టార్ హీరో దిలీప్‌ను జైలు పాల్జేయడం దగ్గర నుంచి అక్కడ సినీ పరిశ్రమ ఒకేస్థాయి హీట్‌ను ఫేస్ చేస్తోంది. సద్దుమణిగింది అనుకున్న వ్యవహారంలో తాజా పరిణామాలు కొత్త రచ్చను రేపాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ వ్యవహారం మరోసారి మలయాళీ స్టార్ హీరోలను విలన్స్‌గా మార్చగా, హీరోయిన్లలోని సిసలైన హీరోయిజం బయటకు వచ్చింది.
ఒక హీరోయిన్‌పై లైంగిక దాడి చేయించిన వ్యక్తిగా, ఆమెపై కసితీరా వ్యవహరించిన వ్యక్తిగా దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే అన్ని ఆరోపణలు వచ్చినా అవేవీ తనను ఏమీ చేయలేవన్నట్టుగా దిలీప్ మలయాళ మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)పై తన పట్టేమిటో నిరూపించగా, కౌంటర్ అటాక్‌లో భాగంగా హీరోయిన్లు కూడా తమసత్తా ఏమిటో నిరూపించారు. ఒక నటిపై జరిగిన లైంగిక దాడి వ్యవహారంలో దిలీప్ తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. తనకూ తన మాజీ భార్యకు గొడవ పెట్టిందన్న కసితో ఆమెపై దిలీప్ లైంగిక దాడి చేయించాడనే ఆరోపణలు వచ్చాయి.
కేసులు నమోదయ్యాయి. దిలీప్ అరెస్టయ్యాడు. నెలల తరబడి జైల్లో గడిపాడు. అయితే తర్వాత బెయిల్ లభించి బయటకు వచ్చాడు. అలాగని దిలీప్ నిర్దోషిగా బయటకురాలేదు. ఆ వ్యవహారంలో దిలీప్ పాత్ర ఇంకా అనుమానాస్పదమే. కోర్టులో ఆ వ్యవహారం రుజువుకావొచ్చు. ఒకవేళ రుజువుగాక దిలీప్ బయటకు వస్తే ఎవరికీ ఏ ఇబ్బందిలేదు. కానీ.. దిలీప్ ఇంకా నిర్దోషిగా బయటపడకముందే మలయాళీ నటీనటుల అసోసియేషన్లో దిలీప్‌కు స్థానం కల్పించాడు. ఇలా చేసింది మరెవరో కాదు.. స్టార్ హీరో మోహన్‌లాల్.
అమ్మకు ప్రెసిడెంట్ మోహన్ లాలే. అభియోగాలు ఎదుర్కొంటున్నాడని చెప్పి దిలీప్‌ను అతడు జైలుపాలు కాగానే సస్పెండ్ చేశారు. అయితే అభియోగాలు అలాగే ఉండగానే మళ్లీ అతడిని అమ్మలోకి చేర్చుకున్నారు. ఇదీ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఎందుకు సస్పండ్ చేసినట్టు? ఎందుకు మళ్లీ చేర్చుకున్నట్టు? అంటే మోహన్ లాల్ నుంచి సరైన సమాధానం లేదు.
ఈ నేపథ్యంలో కొందరు మలయాళీ హీరోయిన్లు డేర్‌గా వ్యవహరించారు. దిలీప్‌పై ఆరోపణలు ఉన్నా.. అభియోగాలు నమోదైనా అతడిని ఎలా తిరిగి చేర్చుకుంటారు? అని వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటివరకూ ఐదుమంది హీరోయిన్లు అమ్మకు రాజీనామా చేశారు. అర్థరహితంగా వ్యవహరిస్తున్న అమ్మలో తాము సభ్యులుగా ఉండలేమని నిరసన తెలుపుతూ వారు బయటకు వచ్చారు. ఈ అమ్మాయిల తెగువతో మోహన్‌లాల్ ఇరకాటంలో పడిపోయాడు. అధ్యక్షుడి హోదాలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అతడిని హీరోయిన్లు నిలువునా ఇరికించేశారు.
రాజీనామా చేసిన వాళ్లలో రెమ్యా నంబీశన్, రీమా కళింగల్, గీతూ మోహన్‌దాస్, పార్వతి, రేష్మారాజన్‌లు ఉన్నారు. వీరు దిలీప్‌ను అమ్మలోకి తిరిగి చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వీళ్లు ఇలా తిరుగుబావుట ఎగరేయడం చిన్న విషయం ఏమీకాదు. ఎందుకంటే దిలీప్ అంటే అల్లాటప్పా కాదు… మొత్తం మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీనే తన గుప్పిటో ్లపెట్టుకున్న వ్యక్తి అతడు. ఆ ధైర్యంతోనే తనేంచేసినా చెల్లుతుందనే అహంతోనే దిలీప్ నటిపై దాడి చేయించాడనే ఆరోపణలున్నాయి.
తనకు ఎదురు తిరిగిన వాళ్లను తీసేసే మనస్తత్వం దిలీప్‌ది. ఇక ఇండస్ట్రీలో అతడు సంపాదించిన ఆస్తుల ముందు అందరూ తలవంచాల్సిందేనట. చివరకు దిలీప్ కన్నా చాలా సీనియర్లు అయిన మమ్ముట్టీ, మోహన్‌లాల్‌లు కూడా దిలీప్‌ను ఎదిరించే పరిస్థితి లేదని, వాళ్లు కూడా ముందు నుంచినే ఇతడికి గులాంగిరి చేసే వాళ్లని మలయాళీ ఇండస్ట్రీ గుట్లును ఎరిగిన వాళ్లు అంటారు. అరెస్టు అయ్యే సమయానికి కూడా దిలీప్‌పై తీవ్రమైన చర్యలు తీసుకునే ధైర్యం అమ్మ కార్యవర్గానికి లేదని, అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో, జనాలు కూడా అసహ్యించుకోవడంతో దిలీప్‌ను బహిష్కరించారని.. ఇప్పుడు వేడి చల్లారిందనే ధైర్యంతో దిలీప్ మళ్లీ చక్రం తిప్పి అమ్మలోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది.
గతం నుంచి తనమాట జవదాటలేని మోహన్ లాల్ ద్వారా దిలీప్ చక్రం తిప్పాడని, డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. తద్వారా తనసత్తా ఏమిటో దిలీప్ చూపించాడు. ఇప్పుడు రాజీనామాల నిరసనలతో మలయాళీ హీరోయిన్లు అటు మోహన్ లాల్‌ను ఇటు దిలీప్‌ను పూర్తిగా ఇరకాటంలో పెట్టేశారు. ఒకవేళ వీళ్లు గనుక మనకెందుకులే, దిలీప్ శక్తి ఎక్కువ అని వెనుకడుగు వేసి ఉంటే.. దిలీప్ మళ్లీ హీరో అయిపోయేవాడు. అయితే ఈ అమ్మాయిలు డేర్‌గా వ్యవహరించడంతో దిలీప్ పూర్తిగా ఇరకాటంలోకి పడిపోయాడు.
దిలీప్ రాచకార్యాలు అన్నీ మళ్లీ చర్చలోకి వచ్చాయి. అలాగే దిలీప్ చెప్పినట్టుగా నడుచుకున్న మోహన్‌లాల్ కూడా నైతికంగా ఇరకాటంలో పడ్డాడు. అంత తీవ్రమైన తప్పు చేశాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని సమర్థిస్తున్న మోహన్‌లాల్ కూడా అనైతికంగా వ్యవహరించినట్టే అయ్యింది. ఈ వ్యవహారంతో అర్థం చేసుకోగల సందేశం ఏమిటంటే.. సినిమా హీరోలు సినిమాల్లో మాత్రమే హీరోలు. బయటమాత్రం వాళ్లు అత్యంత హీనులు. ఈ మొత్తం ఎపిసోడ్లో దిలీప్‌ది విలన్ మనస్తత్వం అని స్ఫష్టం అవుతుంటే, మోహన్ లాల్ విలన్‌కు కాళ్లొత్తడానికి వెనుకాడని వ్యక్తి అవుతున్నాడు.
ప్రస్తుతానికి హీరోయిన్లు మాత్రం చాలా డేర్‌స్టెప్ తీసుకున్నారు. రాజీనామా అస్త్రాలతో స్టార్ హీరోల బతుకులను రోడ్డుకు ఈడ్చారు. అయితే ఇప్పుడు కూడా దిలీప్, మోహన్‌లాల్‌లు తమను తాము సమర్థించుకోవచ్చు. వెర్రి అభిమానులు వారిని సమర్థించవచ్చు. అయితే నైతికతతో ఆలోచించే వాళ్లు కొందరైనా ఉంటారు. వారిలెక్కలో మాత్రం దిలీప్, మోహన్‌లాల్.. వీళ్లిద్దరినీ సమర్థిస్తున్న వాళ్లంతా భ్రష్టులు అయ్యారు. నటిపై దాడి ఎపిసోడ్లో ముందుగా దిలీప్ భ్రష్టుడు అయిపోతే, తను కూడా ఉన్నానని మోహన్‌లాల్ మరింత భ్రష్టుడు అయ్యాడు.
మరోవైపు కల్చరల్‌గా బాడా డెవలప్డ్ అనుకున్న మలయాళీ గడ్డ మీద హీరోయిన్లను నీఛమైన మాటలతో తిట్టే నెటిజన్లకు లోటు ఏమీ కనిపించడంలేదు. తమ అభిమాన హీరోలను ఏమైనా అంటే.. హీరోయిన్లను అనరాని మాటలతో తిడుతున్నారు నెటిజన్లు. మిమ్మల్ని కూడా రేప్ చేస్తాం అనేంత నీఛంగా వ్యవహరిస్తున్నారు అక్కడి సినీ పిచ్చి అభిమానులు. అలాంటి పరిస్థితుల్లో ఈ హీరోయిన్ల తెగవకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!