ఓ ఇన్సిడెంట్.. శృతిహాసన్ కెరీర్‌ని దెబ్బ కొట్టేలా కన్పిస్తోంది. నాగార్జున – కార్తీ కాంబినేషన్‌లో రానున్న సినిమాకి తొలుత శృతిహాసన్ ఓకే చెప్పడం, ఆ తర్వాత డేట్లు కుదరవని నిర్మాతకు తేల్చి చెప్పడం.. ఒళ్ళు మండిన నిర్మాత కోర్టును ఆశ్రయిస్తే, కోర్టుకు తన వాదనను శృతి విన్పించడం, చివరికి తెరవెనుక వివాదం సద్దుమణగడం తెల్సిన విషయాలే. ఈ వివాదం తర్వాత శృతిహాసన్‌తో సినిమా అంటేనే దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట.
దర్శక నిర్మాతలకు నటీనటులు ఎంత కన్వీనియెంట్‌గా వుంటే ఫైనల్ ప్రోడక్ట్ అంత బాగా వస్తుంది. అది దర్శక నిర్మాతలకన్నా నటీనటుల కెరీర్‌కే ఎక్కువ దోహదపడ్తుంది. విశ్వ నటుడు కమల్‌హాసన్ కుమార్తెకు ఈ విషయం తెలియదా.? అంటే తెలియదని కాదుగానీ, ఎక్కడో శృతిహాసన్ చేసిన చిన్న పొరపాటు ఇంత వివాదానికి కారణమయ్యింది. అయినాసరే తన తప్పు లేకుండా, విషయాన్ని నిర్మాతకి పూసగుచ్చినట్లు చెప్పే ప్రయత్నం చేసింది.
కానీ, శృతిహాసన్‌కి ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా, నిర్మాత ఆమెపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దాంతో ఆమె కాదనేసరికి తట్టుకోలేకపోయాడు. ఇదీ అసలు జరిగిన విషయం. అయినప్పటికీ, శృతిహాసన్ డేట్లు ఇచ్చి, ఆ తర్వాత పరేషాన్ చేస్తుందన్న ప్రచారమైతే జోరుగా జరిగిపోయింది. ఇంకేముంది, శృతిహాసన్ ఇకపై ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ విషయంలో సెకెండ్ బెస్ట్ ఆప్షన్ తప్ప, ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అనుకోడానికి లేని పరిస్థితి వచ్చేసిందని సినీ రంగంలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఒక్క ఉదంతంతోనే శృతి కెరీర్‌పై మచ్చ వేసేయడమూ తగదుగానీ, ఇండస్ట్రీలో మాత్రం చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారిపోతుంటాయి మరి.!