ప్రపంచకప్ నుంచి క్వార్టర్స్ దశలో బయటకు వచ్చిన పాకిస్తాన్ జట్టులో చాలా మార్పులు చేసి కొత్త జట్టును బంగ్లాకు పంపించారు. ఆసీస్ లో జరిగిన ప్రపంచకప్ లో ఆడిన ఆటగాళ్లలో ఏకంగా ఏడు మందిని ఇంటికి పంపించారు. వారి స్థానంలో కొత్త వారిని కూర్చి బంగ్లాకు జట్టును పంపించారు. అయితే ఈ కొత్త వారితో ఏవో అద్భుతాలు జరుగుతాయనుకొంటే.. అద్భుతమే జరిగింది. అయితే అది పాక్ తరపు నుంచి కాదు. బంగ్లాదేశ్ తరపు నుంచి!
వన్డే సీరిస్ ను బంగ్లా క్లీన్ స్వీప్ చేసింది. వరసగా మూడు మ్యాచ్ లలో పాక్ ను ఓడించి సత్తా చాటింది. మరి ఇది పాక్ వీక్ కావడం వల్ల జరిగిందా.. లేక నిజంగానే బంగ్లాదేశ్ ఇంతలా బలపడిందా?! అనే సందేహాలు కలుగుతున్నాయి.
ప్రపంచకప్ లో బంగ్లా స్ఫూర్తి దాయకమైన ప్రతిభను కనబరించింది. లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించింది. క్వార్టర్స్ లో ఇండియాకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇండియాతో మ్యాచ్ విషయంలో అయితే.. అంపైరింగ్ వల్ల అన్యాయం జరిగిందని లేకపోతే ఆ మ్యాచ్ లో తమే గెలిచేవాళ్లమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తో సహా అనేక మంది వాపోయారు! అయితే అది సిల్లీ.
ఇప్పుడు మాత్రం బంగ్లదేశ్ బాగానే ఆడింది. పాక్ జట్టు వీక్ పాయింట్లను ఆధారంగా చేసుకొని రాణించింది. విశేషం ఏమిటంటే.. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా బంగ్లా వెళుతుంది. ఒక టెస్టు మ్యాచ్ ను.. వన్డే సీరిస్ ను ఆడబోతోంది. కాబట్టి.. మనోళ్లు బంగ్లాను ఎదుర్కొనడానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలేమో!