సుచి లీక్స్‌.. సంచలనమా? సంచలనం కోసమా?

-ప్రతిభావంతమైన గాయకురాలే అయినా ఇలా Advertisement -సెలబ్రిటీల వైపు నుంచి పోర్న్‌ వైపుకు -సుచిత్రపై స్పందించని సెలబ్రిటీలు -ఇంటర్నెట్‌లో ఇదో న్యూసెన్స్‌ సెలబ్రిటీల జాతకాలు బయటపెడతా… వారి రాసలీలలు వెలుగులోకి తీసుకొస్తా.. రచ్చ రచ్చ…

-ప్రతిభావంతమైన గాయకురాలే అయినా ఇలా

-సెలబ్రిటీల వైపు నుంచి పోర్న్‌ వైపుకు

-సుచిత్రపై స్పందించని సెలబ్రిటీలు

-ఇంటర్నెట్‌లో ఇదో న్యూసెన్స్‌

సెలబ్రిటీల జాతకాలు బయటపెడతా… వారి రాసలీలలు వెలుగులోకి తీసుకొస్తా.. రచ్చ రచ్చ చేస్తా.. ఎవ్వరినీ వదలను అందరి భరతం పడతా.. అని చాలెంజులు చేసిన సింగర్‌ సుచిత్ర మొదట్లో సంచలనమే సృష్టించింది. సంచలన ఆరోపణలతో, రకరకాల పొటోలు, వీడియోలను ట్వీట్‌ చేసి వార్తల్లోకి వచ్చిన ఈమెకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది మీడియా. సెలబ్రిటీల ప్రైవేట్‌ లైఫ్‌కు సంబంధించిన వ్యవహారాలతో ఈమె సంచలనం సృష్టించబోతోందని చాలామంది సినీ ప్రేక్షకులు కూడా సుచిలీక్స్‌పై దృష్టి సారించారు. మీడియా అయితే.. సుచీలీక్స్‌ అనే వర్డ్‌ను కాయిన్‌ చేసింది. సుచీలీక్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో, ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్‌ అయ్యింది, జాతీయ మీడియా కూడా సుచి ట్విటర్‌ ఖాతాపై దృష్టి సారించింది.

ఓవరాల్‌గా సోషల్‌ మీడియాలో సంచలనంగా నిలిచింది సుచి ట్విటర్‌ ఖాతా. సుచి వార్తల్లోకి రాగానే ఆమె ట్విటర్‌ ఖాతాకు ఫాలోయర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక సుచిత్ర వ్యక్తిగతంగానే వీటిని పోస్టు చేస్తోందా? లేక ఎవరైనా ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఇలాంటి ఫొటోలను, వీడియోలను పోస్టు చేస్తున్నారా? అనేది మరో మిస్టరీగా నిలిచింది. తన ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురి అయ్యిందని ఒకసారి, అదేంలేదు తనే ట్వీట్లు పెడుతున్నా అని మరోసారి సుచిత్ర హల్‌చల్‌ చేసింది. దీనిపై సుచి భర్త వివరణ ఇచ్చాడు. తన భార్య ఒక మానసిక రోగి అని.. కూడా అతడు వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. ఆమె ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురి అయ్యిందని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఇలా పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడటంతో సుచి భర్త కూడా మానసిక రోగేనేమో అనుకోవాల్సి వస్తోంది.

మరి ఈ సంగతులన్నీ ఇలా ఉంటే.. సుచి పోస్టు చేసిన కంటెంట్‌ విషయానికి వస్తే, ఈ అకౌంట్‌ నిర్వాహకులు ఎవరైనా వారు కేవలం మానసిక రోగులే తప్ప మరోటి కాదనే విషయం స్పష్టం అవుతుంది. పోర్న్‌ను వీక్షించే, పోర్న్‌ను పోస్టు చేసే మానసిక రోగులు వాళ్లు. ఆ వీడియోలను సుచినే పోస్టు చేసినా, లేక ఆమె అకౌంట్‌ను అడ్డం పెట్టుకుని వేరే వాళ్లు ఆ పని చేసినా.. వాళ్లు మానసిక రోగులు మాత్రమే.

సుచి అసలు సమస్య ఏమిటి?

సుచి లీక్స్‌లో చాలామంది సెలబ్రిటీల పేర్లే వినిపించాయి.. ధనుష్‌తో మొదలుకుని, నయనతార, అనిరుధ్‌, సంచితా షెట్టి, ఆండ్రియా.. ఇలా చాలా మంది పేర్లను వాడింది సుచిత్ర. ధనుష్‌, అనిరుధ్‌ల మీద అత్యాచార ఆరోపణలు చేసింది. వాళ్లిద్దరూ తనను రేప్‌ చేసినట్టుగా పేర్కొంది. మరి నిజంగానేవారు ఆ పని చేసి ఉంటే.. సుచిత్ర వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపి వారిని జైలుకు పంపాలి. అంతేకానీ.. వాళ్లు మంచోళ్లు కాదు, తనను రేప్‌ చేశారు.. అని సుచిత్ర ట్వీట్లు పెట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. దీన్నిబట్టి ఆమె సంచలనం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తోంది తప్ప.. ఆమె చెబుతున్న మాటల్లో విశ్వసనీయత లేదని అనుకోవాల్సి వస్తోంది.

ఒకవేళ చిత్ర సీమలో.. ధనుష్‌, అనిరుధ్‌లకు గల పలుకుబడి వల్ల సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది అనుకుందాం. మరి సుచికి అన్యాయం చేసిన వాళ్లపై ప్రతీకారం ఇలా తీర్చుకుంటోందని అనుకుందాం.. మరి అలాంటప్పుడు మిగతా వాళ్లపై బురద చల్లడం ఎందుకు? సుచి టార్గెట్‌ ధనుష్‌, అనిరుధ్‌లే కావాల్సింది కానీ.. అమలపాల్‌, నయనతార, అమీ జాక్సన్‌లు ఎందుకు అవుతున్నారు? వారిపేర్లను ఎందుకు వాడుకుంటున్నట్టు? ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం సుచిత్ర సమస్య ఏమిటో అర్థంకాదు. దీంతో ఆమె చేస్తున్న ఆరోపణలకు విలువ లేకుండాపోతోంది. 

అంత ఫేక్‌ కంటెంటే?

సుచిత్ర పోస్టు చేసిన కంటెంట్‌ను గమనిస్తే.. ఇదంతా నకిలీదని స్పష్టం అవుతోంది. ఎవ్వరినీ వదలను అని సుచి ట్విటర్‌ ఖాతా నుంచి పోస్టు అవుతున్న కంటెంట్‌ అంతా ఫేక్‌ అని,  వాటిని సుచిత్ర సంపాదించి పోస్టు చేయడంలేదు అని.. స్పష్టం అవుతోంది. ఈ అకౌంట్‌లో పోస్టు అయిన వీడియోల్లో కొన్ని ముందునుంచినే పాపులర్‌. ఉదాహరణకు అనిరుధ్‌, ఆండ్రియాల లిప్‌కిస్‌ ఫొటో నాలుగైదేళ్ల నుంచి నెట్‌లో ఉంది. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జనాలు కూడా ఆండ్రియా, అనిరుధ్‌లను లైట్‌ తీసుకున్నారు. మరి అలాంటి ఫొటోను ఏదో ఎక్స్‌క్లూజివ్‌ అయినట్టుగా సుచిత్ర ఇప్పుడు పోస్టు చేయడం విడ్డూరంగా ఉంది. అలాగే హన్సిక ఫొటో కూడా బాపతే… తమిళ టీవీ యాంకర్‌ డీడీ ఫొటో మాత్రం ఆమె వ్యక్తిగతమైనది. ఇక తమన్నా, ధనుష్‌, పూనమ్‌ బజ్వాల తాగుడు వీడియో మాత్రం కొచెం కొత్తగా ఉంది. మిగతావేవీ మరీ సంచలనాత్మకమైనవి ఏమీకాదు.

థర్డ్‌గ్రేడ్‌ పోర్న్‌ వీడియోలు..

ఇలాంటివి ఇంటర్నెట్‌ ప్రపంచానికి ఏమీ కొత్తకాదు… సెలబ్రిటీల పేర్లతో కొన్ని వందల, వేల పోర్న్‌ వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. ఇంటర్నెట్‌ విస్తతం అయ్యాకా.. ఈ పోకడ చాలా తీవ్ర స్థాయికి పెరిగింది. ప్రముఖ హీరోయిన్ల, క్రీడాకారుణుల పోర్న్‌ వీడియోస్‌ అంటూ.. నెట్లో వెబ్‌సైట్ల నిర్వాహకులు వీడియోలను ఉంచడం రొటీన్‌గా జరిగేదే. అయితే అలాంటి వీడియోలు ఫేక్‌ అనేవి అందరూ ఎరిగినవే. సదరు సెలబ్రిటీల పర్సనాలిటీకి దగ్గరదగ్గరగా ఉన్న వారిని ఎంచుకుని వీడియోలను చిత్రీకరించి.. అవి అసలు వ్యక్తుల నీలి చిత్రాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారాలను విశ్వసించి.. వాటిని చూసి.. ''సంతృప్తి''  పొందే వాళ్లు పొందుతూ ఉంటారు. మిగతా వాళ్లు వాటిని లైట్‌ తీసుకొంటూ ఉంటారు. ఇలాంటి బాపతు వీడియోలనే సుచి కూడా పోస్టు చేస్తోంది. సెలబ్రిటీల పేర్లను పెట్టి సరుకును అమ్ముకుంటోంది.

నయనతార, ఆండ్రియా, సంచితల వీడియోలుగా సుచి ప్రచారంలోకి తీసుకొచ్చిన వీడియోలు అన్నీ కూడా కేవలం వాళ్ల పేర్లను వాడుకున్నవి మాత్రమే. నెట్‌లోని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి.. ఆ హీరోయిన్ల పేర్లతో సుచిత్ర తను వార్తల్లో నిలుస్తోంది. మరి సుచి ఇంతటితో కూడా ఆగలేదు.. పచ్చి బూతు వీడియోలను, ఫొటోలను కూడా పోస్టు చేయడం మొదలుపెట్టింది. సెలబ్రిటీల పేర్లను ఏమీ పెట్టకుండానే.. బ్లూఫిల్మ్‌ వీడియోలను, ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తోంది. దీంతో ఈమె అసలు కథ అర్థం అవుతోంది. మొదట్లో ఏవో కొన్ని పాత ఫొటోలను పెట్టి ఆసక్తిని రేకెత్తించి.. మరిన్ని సంచలన విషయాలను బయట పెడతాను అని ప్రకటించి, తీరా కాస్త ప్రమోషన్‌ వచ్చిన తర్వాత మాత్రం పోర్న్‌ వీడియోలను పోస్టుచేస్తూ సుచిత్ర.. తన అసలు కథేమిటో అర్థం అయ్యేలాచేసింది. 

జనాలను తక్కువ అంచనా వేస్తోంది!

నిస్సందేహంగా ఈమె మానసిక రోగే. లేకపోతే వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ నుంచి అలాంటి వీడియోలను పోస్టు చేయడాన్ని ఏమనాలి? వాటిని చూడటమే ఒక రకమైన రోగం.. ఇలా వ్యక్తిగత అకౌంట్‌ నుంచి అప్‌లోడ్‌ చేయడం అంటే.. అంతకన్నా చెత్త పని మరోటి ఉండదు. ఇలాంటి చెత్తపనులు చేయాలంటే.. మానసిక రోగి అయ్యుండాలి.

అలాగే ఇలాంటి వీడియోలను పోస్టు చేసి.. అవి సెలబ్రిటీలవి అని నమ్మించాలని చూడటం కూడా సుచిత్ర మానసిక స్థితికి మరో దర్పణం. జనాలను తక్కువ అంచనా వేయడమే ఇది. వాటిని నమ్మే అమాయకులు అతి తక్కువ మందే ఉంటారు. అలాంటి వారి కోసమే సుచిత్ర పోస్టు చేస్తూ ఉండాలి. మిగతా వారు మాత్రం.. మొదట్లో ఈమె తీరుపై ఆసక్తితో దృష్టి సారించినా, తర్వాత మాత్రం ఇదంతా కేవలం పోర్న్‌.. మాత్రమే అనే క్లారిటీతో దీన్ని పట్టించుకోవడం మానేశారు.

సెలబ్రిటీలు లైట్‌ తీసుకున్నారా?

గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ లీక్స్‌ను సెలబ్రిటీలు పిచ్చలైట్‌ తీసుకున్నారు. సుచిత్ర ఏమో చాలామంది సెలబ్రిటీల పేర్లనే చెప్పినా.. సదరు సెలబ్రిటీలే వీటి గురించి స్పందించలేదు. సుచీ లీక్స్‌లో పోస్టు అయిన వీడియోస్‌లో ఉన్నది తాము కాదని చెప్పే పని కూడా పెట్టుకోలేదు. ఒకరిద్దరు మాత్రం స్పందించారు. సంచితాషెట్టి నగ్న వీడియో అని సుచిత్ర పోస్టు చేయగా.. దాన్ని ఆమె ఖండించింది. అందులో ఉన్నది తను కాదు అని ఆమె వివరణ ఇచ్చుకుంది. అప్పటికి సుచి లీక్స్‌ హాట్‌ హాట్‌గా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం.. ఎవ్వరూ రియాక్ట్‌ కాలేదు.

అనిరుధ్‌, ధనుష్‌, త్రిష.. అంటూ సుచిత్ర ప్రముఖుల పేర్లనే చెప్పినా వాళ్లు స్పందించలేదు. సుచీ లీక్స్‌ను తాము వినలేదు, కనలేదు అన్నట్టుగా ఉండిపోయారు. తనపై అత్యాచార ఆరోపణలు చేసినా ధనుష్‌ రియాక్ట్‌ కాలేదు. ధనుష్‌ను పదే పదే టార్గెట్‌ చేసింది సుచిత్ర. అతడు మంచోడు కాడు అని, వ్యక్తిత్వం లేదు అని.. రకరకాల ఆరోపణలు చేసింది. దీనిపై దనుష్‌ చెల్లెలు రియాక్ట్‌ అయ్యింది. సుచిత్ర ఆరోపణలను ఖండించింది. ధనుష్‌ మాత్రం తను స్పందించదగిన అంశం కాదన్నట్టుగా ఉండిపోయాడు.

ఇక ప్లేబాయ్‌లా కనిపించే అనిరుధ్‌ వీటిపై రియాక్ట్‌ కాలేదు.. రియాక్ట్‌ అవుతాడని కూడా అనుకోలేం. నయనతార అయితే.. తన పేరును సుచీ వాడేసినా.. ఏకంగా నగ్న వీడియో అంటూ పోస్టు చేసినా.. పట్టించుకోలేదు. ఇలాంటివెన్నో చూశాంలే అన్నట్టుగా వ్యవహరించింది నయన. తొలి రెండ్రోజులూ సుచీ లీక్స్‌తో సెలబ్రిటీలు తొట్రుపాటు పడినట్టుగా కనిపించినా.. ఆ తర్వాత మాత్రం డోంట్‌ కేర్‌ అన్నట్టుగా వ్యవహరించారు.

పోలీస్‌ కేసు ఎందుకు పెట్టలేదు?

ఈ మొత్తం ఎపిసోడ్‌లో పెద్ద సందేహం ఏమిటంటే.. సుచిపై ఎవ్వరూ పోలీస్‌ కేసుల జోలికి పోకపోవడం. మామూలుగా అయితే తమ గురించి అనుచితమైన వీడియోలను ఎవ్వరు ప్రచారంలోకి తీసుకొచ్చినా వాటిపై పోలీసులకు సదరు సెలబ్రిటీలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. వెనుకటికి త్రిష ఇదే పని చేసింది. తను స్నానం చేస్తున్న వీడియోగా ప్రచారంలోకి వచ్చిన వీడియో సంచలనం సష్టించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనికోరింది. అయితే బాధ్యులెవరో పోలీసులు కనుక్కోలేకపోయారు. అయితే.. ఇప్పుడు అనుచితమైన వీడియోలను పోస్టు చేస్తోంది ఎవరో అందరికీ స్పష్టత ఉంది. సుచిత్ర ఎవరో.. ఆమె ఎక్కడుంటుందో.. అందరికీ తెలుసు.

ముందుగా ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు కథ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సుచిత్ర వ్యక్తిగతంగానే ఈ పోస్టులు పెడుతోందా? లేక ఎవరైనా ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఈ ఫొటోలను పెడుతున్నారా? ఈ పొటోలను వారు ఎలా సంపాదించారు? అనే విషయాలన్నీ కూలంకషంగా వెలుగులోకి వచ్చింది. అయితే సెలబ్రిటీలు మాత్రం ఈ దిశగా స్పందించడం లేదు. సుచిత్ర మీద ఎవ్వరూ కంప్లైంట్లు చేయలేదు. ఆమె కథేమిటో తేల్చమని అడగలేదు. ఇలా ఎందుకు చేయడంలేదు? అనేది కూడా అంతుబట్టని విషయమే. స్పందిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని అనుకుంటున్నారా? లేక సుచిత్ర మీద ఫిర్యాదు చేయడానికి వారికి భయాలున్నాయా? సుచిత్ర మీద ఫిర్యాదు చేస్తే.. ఇంకా సంచనాలు ఏమైనా బయటకు వస్తాయని వారు భయపడుతున్నారా? అనే సందేహాలు రేగుతున్నాయిప్పుడు. సుచీలీక్స్‌ పేరున్న సెలబ్రిటీలు మౌనంగా ఉండాల్సిన సమయం అయితే కాదిది. వారు స్పందించాలి. దీనిపై సైబర్‌క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ జరగాలి.. కానీ సినిమా వాళ్లకు కూడా దీనిపై ఆసక్తి లేదని మాత్రం స్పష్టం అవుతోంది. మరి సూదికోసం సోదికి వెళితే పాత రంకంతా బయటపడుతుందనే భయం కాబోలు ఇది!

ప్రతిభావంతమైన గాయకురాలు.. క్యూట్‌ సాంగ్స్‌!

ఈ లీక్స్‌ వ్యవహారాన్ని పక్కన పెట్టి.. ఎవరీ సుచిత్ర, ఏమీటీమె కథ అంటే.. ఈమె ప్రతిభావంతురాలనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఈ రోజుల్లో ఏ పాటను ఎవరు పాడారో ఎవరికీ తెలియదు. సింగర్లకు తగిన గుర్తింపులేదు. ఒక సినిమాలో పాడినవారు.. మరో సినిమాకు ఊసులో ఉండటంలేదు.  దశాబ్దాల పాటు లీడింగ్‌లో ఉండటం కాదు కదా.. కనీసం ఒకే సినిమాకు రెండోపాట పాడే అవకాశం రావడం కూడా గగనమే అనే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు పదిహేనేళ్లుగా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో వచ్చిన ఒక్కో అవకాశాన్ని ఉపయోగించుకొంటూ.. తన ప్రత్యేకతను నిలుపుకొంటూ సాగుతున్న గాయని సుచిత్ర. 

రేడీయో జాకీగా ఈమె ప్రస్థానం ఆరంభం అయ్యింది. ఎఫ్‌ఎంల బూమ్‌లో సుచిత్ర చెన్నైలోని ఒక ఎఫ్‌ఎంలో ఆర్జేగా గుర్తింపు సంపాదించుకుంది. అలా దక్కిన గుర్తింపుతో సినిమాల వైపు వచ్చింది. మొదట్లో అనేక మంది హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పింది. మల్లన్న సినిమా తమిళ వెర్షన్లో హీరోయిన్‌ శ్రియకు డబ్బింగ్‌ చెప్పింది సుచిత్ర. అలా ప్రముఖ హీరోయిన్లకు తమిళ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కొనసాగింది. పాట పాడే అవకాశాలు వచ్చాయి. తన క్యూట్‌ వాయిస్‌తో ఆడియన్స్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

తెలుగు మ్యూజిక్‌ లిజనర్స్‌కు కూడా సుచిత్ర సుపరిచితురాలే. ఈమె పాడిన తెలుగు పాటల్లో కొన్ని సూపర్‌ హిట్స్‌ ఉన్నాయి. బిజినెస్‌ మ్యాన్‌ సినిమాలో 'సారొస్తారా..' సాంగ్‌కు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది సుచిత్ర. ఆ సాంగ్‌ ఎంత పాపులరో కొత్తగా చెప్పనక్కర్లేదు. అంతకన్నా బాగా ఎంటర్‌టైన్‌ చేసిన సాంగ్‌ ''ఊపిరి'' సినిమాలో ఉంది. ''సీతాకోక చిలకల గుంపు..'' అంటూ సాగే సాంగ్‌ తెలుగు ఆడియన్స్‌ను అదరగొట్టేసింది. రూరల్‌ ఆంధ్రాలో ఆటో జర్నీల్లో కూడా ఈ పాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటకు సంగీతం, సాహిత్యమే కాదు.. సుచిత్ర వాయిస్‌ పెద్ద ఎసెట్‌. చాలా క్యూట్‌గా ఆసాంగ్‌ పాడిందీమె. పాటను విజువల్‌గా చూడటం కన్నా, వినడమే గొప్ప అనుభూతి. అలాంటి అనుభూతిని పంచగల శక్తి ఉంది సుచిత్ర వాయిస్‌కు.

మరి అలాంటి సుచిత్ర నుంచి ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎక్స్‌పెక్ట్‌ చేయడం కష్టమే. ఇదే సమయంలో.. సుచిత్ర ప్రత్యేకించి సంగీత దర్శకుడు అనిరుధ్‌పై ఆరోపణలతో మొదలుపెట్టడాన్ని బట్టి చూస్తే, సింగర్లకు మ్యూజిక్‌ డైరెక్టర్లకు మధ్య ఎలాంటి వాతావరణం ఉందో కూడా అర్థం అవుతోంది. ఇలాచూస్తే.. సుచిత్ర బాధితురాలేమో అనే అభిప్రాయం కలుగుతోంది. కానీ బాధితురాలైనా.. ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదేమో.