cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'నార్కోస్' నుంచి మరీ ఇంతిలా ఎత్తాలా సుకుమార్ గారూ!

'నార్కోస్' నుంచి మరీ ఇంతిలా ఎత్తాలా సుకుమార్ గారూ!

"పుష్ప" సినిమా మొదటి నుంచీ ఆసక్తి రేపుతూనే ఉంది. దానికి ముఖ్యకారణం అల్లు అర్జున్ కంటే సుకుమారే. 

"రంగస్థలం" లాంటి అద్భుతమైన సినిమా తర్వాత తీసిన సినిమా ఇది. సుకుమార్ ఒరిజినాలిటీకి మారుపేరు. ఇన్స్పైర్ అవ్వడాలు, సీన్లు ఎత్తడాలు ఆయన విషయంలో తక్కువే. అందుకనే ఎక్కడా చూడని ఒక కొత్త ఫీలింగ్ "పుష్ప"లో దక్కుతుందని అందరూ ఆశించారు. 

కానీ ఎందుకో మ్యాస్టారు ఈ సారి సహజ ప్రతిభకంటే స్ఫూర్తినే ఎక్కువగా నమ్ముకున్నట్టునారు. 

దేవీశ్రీప్రసాద్ "ఊ అంటావా" పాట ట్యూన్ ఎక్కడినుంచో ఎత్తారని ట్రోలింగ్ చేసారు నెటిజన్లు. అది చాలా చిన్న విషయమనిపిస్తుంది సుకుమార్ గారు నార్కోస్ నుంచి పొందిన ఇన్స్పిరేషన్ చూస్తే. 

సింపుల్ గా చెప్పాలంటే అసలు "నార్కోస్" చూసిన తర్వాతే సుకుమార్ కి ఈ "పుష్ప" తీయాలనే ఆలోచన వచ్చిందేమో అనిపిస్తుంది. 

"నార్కోస్" అనేది పాబ్లో ఎస్కోబార్ అనబడే ఒక డ్రగ్ ట్రాఫికర్ జీవితకథ. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన డ్రగ్ మాఫియా డాన్ గా అతను ఎదిగిన తీరు, కొలంబియానుంచి అమెరికాకి డ్రగ్స్ ఎలా తరలించాడన్న విధానం నార్కోస్ మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే ఉంటుంది. 

నిజానికి సుకుమార్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే "నార్కోస్" పూర్తి స్థాయి స్పానిష్ వెబ్ సిరీస్ అయినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్.

విజయవాడ, గుడివాడ, తిరుపతి, కడప, శ్రీకాకుళం, నిజామాబాదు అనే తేడా లేకుండా చాలా చోట్ల ఉన్న తెలుగు యువత ఆ సిరీస్ ని ఎంతో ఇష్టంగా చూసారు. నెట్ ఫ్లిక్స్ ఇండియాకి వచ్చిన కొత్తలో ఇక్కడి ప్రజల్ని విశేషంగా ఆకర్షించిన సిరీస్ ఇదే. 

అయినా కూడా ఎక్కడా బెరుకు చెందకుండా చాలా ఒడుపుగా ఆ కథని "పుష్ప" కి తర్జుమా చేసుకున్నారు. 

"నార్కోస్" ఒక సీరియస్ బయోపిక్. అయినా కూడా చాలా డ్రమటిక్ గా ఉంటుంది. భావోద్వేగాల్ని అద్భుతంగా అవిష్కరించారందులో. ఒక్క సీన్ గానీ, ఒక్క డయలాగ్ కానీ అనవసరం అన్నట్టుగా ఉండవు. ఏదీ బోర్ కొట్టదు. ల్యాగ్ అనిపించదు. 

అలాంటి బయోపిక్ కాకపోయినా "పుష్ప" పేరుతో ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథని కాల్పనికంగా తెరకెక్కించాలన్న ఆలోచన మంచిదే.

కానీ మాస్ హీరో సినిమా కాబట్టి "నార్కోస్" మాదిరిగా రియలిజం కాకుండా హెవీ యాక్షన్ సినిమాగా మలిచారు సుకుమార్. అది కూడా బాగానే ఉంది. 

కానీ సినిమాలో కీలకమైన సన్నివేశాలు చూస్తుంటే "నార్కోస్" నరాల్లో నిండిన ప్రేక్షకులకి ఎక్కడో చూసినట్టు కొడతాయి.

"నార్కోస్" లో పాబ్లో ఎస్కోబార్ ఇంట్రడక్షన్ సీన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. డ్రగ్స్ ని కొన్ని వ్యాన్స్ లో ఒక కాన్వాయ్ లాగ తరలిస్తుంటాడు. చెక్ పోస్ట్ పోలీసులు ఆపుతారు. కంటైనర్ ఓపెన్ చెయ్యమంటారు. పాబ్లో చాలా కూల్ గా వాళ్లతో ఎంతో డబ్బిస్తానని డీల్ మాట్లడతాడు. "డీల్ అయినా ఒప్పుకోవాలి..లేదా పర్యవసానాలు ఎదుర్కోవాలి", అని స్మూత్ గా బెదిరిస్తాడు. అంతే..అతనికి లైన్ క్లియర్ అయిపోతుంది. 

ఇదే సీన్ యథాతధంగా "పుష్ప" లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్. అయితే స్టైల్ మార్చారు. మాస్ మసాలా కాబట్టి 10 వేలు, ఇరవైవేలు అని బేరం పెంచుతూ, పోలీసుల్ని ఎగరేసి కొడుతుంటాడు పుష్పరాజు. అదొక్కటే తేడా. అక్కడా ఇక్కడా కామన్ ఎంటంటే..ఇంట్రడక్షన్ సీన్లో పోలీసులతో బేరం. 

అలాగే అక్కడ హరారే అని ఒక సీనియర్ కాప్ ఉంటాడు. "పుష్ప" లో ఫస్టాఫులో వచ్చే గోవిందప్పలాగ అన్నమాట. పాబ్లో ఎస్కోబార్ ని పోలీస్ స్టేషన్ కి రప్పించి క్రిమినల్ రికార్డులో పెట్టేందుకు ఫోటోలు తీస్తాడు. అస్సలు భయం లేని పాబ్లో ఆ స్టేషన్లో నవ్వుతూనే ఉంటాడు. "వచ్చిన దగ్గర్నుంచీ నవ్వుతూనే ఉన్నాడు" అంటూ ఒక పోలీసాఫీసర్ డయలాగ్ కూడా ఉంటుంది. 

తెలుస్తోంది కదా! "పుష్ప"లో కూడా ఇదే సీన్ ఉందని..! తేడా ఎంటంటే ఇక్కడ పుష్పరాజుని పోలీసులు చితక్కొడతారు. నవ్వు మాత్రం అక్కడా ఇక్కడా కామనే. 

అలాగే మరో పాయింటు. అక్కడ పాబ్లో ఎస్కోబార్ చీలీ దేశం నుంచి డ్రగ్స్ తరలించడానికి కార్ టైర్ల దగ్గర ఉన్న చోటుని ఎంచుకుంటాడు. ఆ పద్ధతిలో తన మనుషులు దొరికిపోయే వరకు చాలా ట్రిప్పులు అదే పద్ధతిలో కొనసాగిస్తాడు. 

"పుష్ప"లో కూడా అంతే కదా. తేడా ఎంటంటే ఇక్కడ కార్ల బదులు పాల వ్యాన్. మనుషులు దొరికిపోయేవరకు ఈ పద్ధతిలో స్మగ్లింగ్ చేయడం అనేది కామన్. 

ఇలా చూసుకుంటూ పోతే "పుష్ప" ని "నార్కోస్" లో చూసేయొచ్చు. 

అన్నిటికంటే మించి పుష్పరాజ్ గెటప్. గెడ్డమొకటే ప్రధానమైన తేడా. కొంతవరకు హెయిర్ స్టైల్ గానీ, నార్మల్ బాడీ కానీ, వెరైటీ నడక కానీ అన్నీ పాబ్లో ఎస్కోబార్ గా చేసిన వాగ్నర్ మౌరాని అనుసరించే ఉన్నాయి అల్లు అర్జున్ విధానాలు కూడా. 

ఇక "పుష్ప"లో లవ్ ట్రాక్ మాత్రం సుకుమార్ గారి సొంతం. దానికి నార్కోస్ లో మూలాలు కనపడవు. అయితే పాబ్లోకి తన భార్య తాతా అంటే అమితమైన ప్రేమ. ఆమెని ఎవ్వరు అమర్యాద చేసినా తట్టుకోలేడు. సెకండ్ పార్టులో ఈ వ్యవహారం ఉంటుందేమో మరి. 

అలాగే "నార్కోస్" లో ముగ్గురు కీలకమైన డ్రగ్ డీలర్స్ ని పరిచయం చేస్తాడు మొదటి ఎపిసోడ్ లో. వారిలో ఒషియా బ్రదర్స్ అనే వాళ్లు సాఫ్ట్.  రెండో వాడు గాచా. అతను చాలా క్రూరుడు. పార్ట్నర్స్ ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసే ఎథిక్స్ లేని వాడు. పైగా అమ్మాయిల పిచ్చి కూడా ఉన్నవాడు. మూడో వాడు పాబ్లో ఎస్కోబార్. 

ఇక్కడ "పుష్ప"లో కూడా ఆ ఛాయలున్నాయి. కొండారెడ్డి బ్రదర్స్ లో ఉండేది ముగ్గురు. వారిలో కొండారెడ్డి పరమ క్రూరుడు. రెండో తమ్ముడు సాఫ్ట్. మూడోవాడు జాలిరెడ్డి అమ్మాయిల పిచ్చి ఉన్నవాడు. ఆ విధంగా నార్కోస్ లో ఉన్న క్యారెక్టర్స్ ని, గుణగణాలని వాడుకుంటూ కాస్త అటు ఇటుగా సర్దారంతే సుకుమార్ గారు. 

పాబ్లో ఎస్కోబార్ కి తన మీద తనకి నమ్మకం ఎక్కువ. ఎప్పటికైనా కొలంబియా ప్రెసిడెంటవ్వాలని అతని ఆశయం. విపరీతంగా సంపాదించడమే ధ్యేయం. ఎవర్నీ లెక్కచెయ్యడు. అతనికి గుస్తావో అని ఒక స్నేహితుడు ఉంటాడు మొదటి నుంచీ. 

పుష్పరాజు క్యారెక్టైరేషన్ కూడా ఇంచుమించు అంతే. ఎదగడమే జీవిత పరమావధి. అతనికీ ఒక స్నేహితున్నాడు. కానీ తెలుగు సినిమాలో హీరోకి సైడ్ కిక్కులాగ అతనికి కామెడీకి పరిమితం చేసారు. 

ఇలా చుక్కలు కలుపుకుంటూ వెళితే అనేకం కనిపిస్తాయి. ఒకవేళ సుకుమార్ గారు ఈ వెబ్ సిరీస్ నే నమ్ముకుని మొత్తం కథ రాసుకునుంటే పుష్ప రెండో భాగం కూడా "నార్కోస్" చూసిన ప్రేక్షకులు ఊహించవచ్చేమో. 

"నార్కోస్" లో పాబ్లో ఎస్కోబార్ కి ఒక జర్నలిస్టు ప్రియురాలు ఉంటుంది. ఇందులో కూడా సెకండ్ పార్టుకి అలాంటి క్యారక్టరుని పెడాతారా సుకుమార్ గారు! జరిగిన కథ కాబట్టి నార్కోస్ లో పాబ్లో సెకండ్ సీజన్ లో పోలీసుల షూటౌట్ లో చనిపోతాడు. కానీ తెలుగు మాస్ హీరో సినిమా కాబట్టి సుకుమార్ గారు ఆ పనైతే చెయ్యకపోవచ్చు. 

ఏది ఏమైనా "నార్కోస్" స్ఫూర్తిని పక్కన పెట్టి, మైండుకు మరింత పదును పెట్టి ఊహించని స్క్రీన్ ప్లేతో కథను నడిపితే తప్ప "ఇదిరా సుకుమార్ సినిమా అంటే" అనే పేరు తెచ్చుకోవడం కష్టం. 

కాలేజీ టాపర్ 100/100 కాకుండా 80% మార్కులు తెచ్చుకుంటే ఫ్యాకల్టీ ఎలాగైతే అతనికి ప్రెజర్ పెడతారో ఇదీ అలాంటిదే అనుకోండి సుకుమార్ గారూ!

మీరు టాలీవుడ్ కి టాపర్. ప్యాన్ ఇండియా సినిమా తీసి తెలుగు సినిమా మర్యాదని మీ భుజాలమీద మోస్తున్నారు. తెలుగు సినిమాని చిన్నబోనీయద్దు. 

మాకు మీరు ఎలాంటి సినిమా చూపించినా ఓకే. కానీ ఈ సినిమాని ఒక గొప్ప సినిమాగా నేషనల్ కాన్వాస్ మీద నిలపాల్సిన బాధ్యత మీకుంది. కనుక ఇలాంటి ఎత్తిపోతల పథకాలొద్దు. 

"పుష్ప" విజయం మీకు, బన్నీకే కాదు...తెలుగు వారందరికీ గర్వకారణమే. "బాహుబలి"తో ఎత్తిన కాలర్ మళ్లీ ఎత్తాలంటే మాకు మీ "పుష్ప" అవసరం. అందుకే ఇదంతా. 

- విశ్లేషణ్

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు