గుప్తా Vs కొడాలి.. మధ్యలో టీడీపీ కుల కంపు

ఒంగోలుకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి ఇటీవల మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా మంత్రి బాలినేని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు…

ఒంగోలుకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి ఇటీవల మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా మంత్రి బాలినేని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో కావడంతో సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైసీపీ నేతగా చెప్పుకుంటున్న సదరు సుబ్బారావు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అదే సమయంలో తానేదో సీఎం జగన్ కి ఉచిత సలహాలిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆ నోటి దురుసుకి ప్రతిఫలంగా సుబ్బారావు ఇంటిపై దాడి జరిగింది, తన్నులకు భయపడి అతను ముందుగానే పరారైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో టీడీపీ, దాని అను'కుల' మీడియా బరితెగించాయి. ఆయన సుబ్బారావు కాదు, సుబ్బారావు గుప్తా అనే వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాయి. గుప్తాపై జరిగిన దాడిని వైశ్య వర్గంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ.. వైసీపీని ఆ వర్గానికి దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అయినా, ఇంకో ఎల్లయ్య అయినా, పుల్లయ్య అయినా.. నోటి దురుసుకి ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందులోనూ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటూ బహిరంగ వేదికపై మంత్రిని, ఎమ్మెల్యేలను కోవర్టులంటూ అవమానించడం కచ్చితంగా టీడీపీ కోవర్టు ఆపరేషనే అనుకోవాలి. అంతే కాదు.. ఈ వ్యాఖ్యలను వైరల్ చేసింది కూడా టీడీపీ అనుకూల మీడియానే. ఆ తర్వాత దాడి ఘటనను కవర్ చేస్తూ పదే పదే కుల ప్రస్తావన తీసుకొచ్చారు. వైశ్యులపై జరిగిన దాడి అంటూ మొసలి కన్నీరు కార్చారు.

రోశయ్య ఎపిసోడ్ తో మొదలు..

ఇటీవలే పరమపదించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు జగన్ నివాళులర్పించలేదని, రోశయ్య చనిపోయిన తర్వాత కనీసం దహన సంస్కారాలకు కూడా వెళ్లలేదని హడావిడి చేసింది టీడీపీ అనుకూల మీడియా. రోశయ్య సంతాప సభల్లో కూడా జగన్ ని టార్గెట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ ఎపిసోడ్ ని కొనసాగిస్తూ ఇప్పుడు గుప్తాని తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా జగన్ ని వైశ్యులకు దూరం చేసే ప్రయత్నం ఇది.

సుబ్బారావు గుప్తా నిజంగా వైసీపీ నేత అయితే, బహిరంగ వేదికపై అంతగా ఘాటు వ్యాఖ్యలు చేయరు. ఒకవేళ నోరు జారినా ఆ తర్వాత సర్దుకునేవారు, క్షమాపణ చెప్పేవారు. లేదంటే ఆ వ్యాఖ్యలపై ధైర్యంగా నిలడేవారు. కానీ ఇలా పారిపోయేవారు కాదు. అక్కడే చంద్రబాబు అనుకూల మీడియా ఆడిన డ్రామా బయటపడిపోయింది. ఇప్పుడు సుబ్బారావు ఎపిసోడ్ ని అడ్డు పెట్టుకుని కులచిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ఇలాంటి కుల కుట్రలతో చంద్రబాబు పార్టీని దాదాపుగా భూస్థాపితం చేశారు. ఇంకా వాటినే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు.