సగటున ప్రతి రాత్రి నిద్రలోనూ ఒక్కో మనిషికి కనీసం నాలుగు కలలు వస్తాయట. ఒక్కోసారి ఈ కలల సంఖ్య ఏడు వరకూ కూడా ఉంటాయట. అయితే.. వాటిలో చాలా వరకూ మనకు గుర్తుండవు. ఒక్కో రోజు ఒక్క కల కూడా రానట్టుగా అనిపించవచ్చు. ఇంకొన్ని సార్లు కొన్ని కలలు గుర్తుండవచ్చు. అయితే కల మధ్యలో లేదా, నిద్ర లేవడానికి ముందే కల ముగిసినట్టుగా అనిపించవచ్చు. అయితే అది గుర్తుకు ఉన్న కల మాత్రమే.
కలలో కనిపించే మనుషులు చాలా వరకూ మనకు తెలిసిన వాళ్లే ఉంటారు! కలలో అయినా చూడలేదు.. అంటూ మనం అనుకుంటాం కానీ, మన కలలో మనకు తెలియని ఏ మనిషినీ ఊహించుకోలేమట. మనిషి మెదడుకు నిద్రలో అలాంటి ఊహాత్మక శక్తి ఉండదని పరిశోధకులు అంటున్నారు. కలలో కనిపించే మనుషులు కచ్చితంగా ఇలలో మనం చూసిన వారే అయ్యుంటారని వారు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే సినిమాలు, ఇతర క్రియేటివ్ వర్క్స్ లో కలలో కనిపించే మనుషులు ఇలలోకి రావడం, స్వప్న సుందరి వంటివి రొటీనే. అయితే మనిషి మెదడుకు మాత్రం కలలో ఒక కొత్త మనిషిని ఊహించుకునే శక్తే ఉండదట! కలలో అంతా తెలిసిన వారే కనిపిస్తారు!
బ్యాడ్ డ్రీమ్ ను అస్సలు మార్చలేం. కలలో జరిగే సంఘటనలను మనం మార్చలేం! మార్చే ప్రయత్నం కూడా ఉండవు. మన కలలో జరిగే సంఘటనల్లో మనమూ ఒక పాత్ర అయినా.. అది ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే. ఆ కలలో ఏం జరుగుతున్నా మార్చడం అనే మాటే ఉండదు. అయితే దీర్ఘకాలం పాటు ఒకే కలే, అది కూడా బ్యాడ్ డ్రీమ్ వస్తుంటే థెరపీ తీసుకుని.. ఆ కల మరోసారి వచ్చినప్పుడు సంఘటనలను మార్చుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
స్పైసీ ఫుడ్ .. పీడకలను తెప్పించగలదని అంటున్నారు పరిశోధకులు. ఎప్పుడైనా రాత్రి మంచి స్పైసీ ఫుడ్ తీసుకుని,.. నిద్రకు ఉపక్రమించాకా, ఏదైనా పీడకల లేదా, బాగా ఇబ్బంది పెట్టే కల రావొచ్చని ఒక పరిశోధన చెబుతూ ఉంది. స్పైసీ స్పైసీ ఫుడ్ తీసుకున్న రాత్రి… హఠాత్తుగా మెలకువను తెప్పించే కల రావొచ్చని అంటున్నారు. మరి ఇది ఎవరికి వారు టెస్టు చేసుకోవచ్చు!
డ్రీమ్ కు సీక్వెల్ కూడా ఉండవచ్చు. రాత్రిపూట రెండు మూడు గంటల నిద్ర తర్వాత మెలకువ వచ్చినప్పుడు, అప్పటి వరకూ ఏదైనా కల వస్తే లేవగానే అది గుర్తుకు రావొచ్చు. మళ్లీ పడుకున్నాకా… అదే కల మళ్లీ రావడం లేదా, దానికి కొనసాగింపు కల రావడం జరగొచ్చు.
కలలో మనం నిరక్షరాస్యులం! మీకు ఎప్పుడైనా గుర్తుందా.. కలలో ఏదైనా చదివినట్టుగా? అలాంటి అనుభవం ఎవరికీ ఉండకపోవచ్చు. కలలో మనకు తెలిసిన భాషను కూడా మనం చదవడం ఉండదంటారు. అక్షరాలను చదవడం, అర్థం చేసుకోవడానికి పని చేసే మెదడు భాగం నిద్రలో ఉన్నప్పుడు పని చేయదు. అందుకే కలలో ఎవరూ ఏమీ చదవలేకపోవచ్చు!
అయితే క్రియేటివ్ కలలు ఉంటాయి. ఏదైనా సినిమా కథనో, కథనో రాస్తున్నట్టుగా కల రావొచ్చు. ఆ కల చాలా ఎగ్జయింటింగ్ అనిపించవచ్చు. ఈ కథకు మీరు ఇచ్చే ట్విస్టులు మిమ్మల్ని అమితాశ్చర్యపరచవచ్చు. ఆ కథతో ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే సినిమా తయారు చేయవచ్చని అనిపించవచ్చు. అయితే అదంతా కలలోనే. ఒక్కసారి నిద్రలేస్తే.. కలలో రాసుకున్న ఆ కథ బిట్స్ అండ్ పీసెస్ గా కూడా గుర్తుకు రాకపోవచ్చు!