అధికారంలో ఉన్నప్పుడు అదే గోడు. ఆ తీరుతోనే అధికారం కోల్పోయారనే విషయం టీడీపీకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ పార్టీ అధినేత వ్యూహాత్మక తప్పిదం అనుకోవాలో, లేక ఆయనకు వ్యూహమే లేదనుకోవాలో కానీ.. అమరావతి అంతిమంగా ముంచేసేది తెలుగుదేశం పార్టీనే అని చెప్పక తప్పదు. అమరావతి పాదయాత్ర, తిరుపతిలో అమరావతి సభ.. ప్రభుత్వం వద్దన్నా, కోర్టులు ఆమోదం తెలపడం.. అవి విజయవంతం అయినట్టుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెప్పుకోవడం… ఇవన్నీ షో చేయడానికి బాగా పనికి వస్తాయేమో కానీ, ఈ వ్యవహారం అంతటితో తెలుగుదేశం పార్టీకే తగని చేటు జరుగుతుందని మరీ పొలిటికల్ పాండిత్యం అక్కర్లేదు.
అమరావతి తోక పట్టుకుని ఏపీ ఎన్నికల ఏటిని ఈదాలని చంద్రబాబు గత పర్యాయం చేశారు. అయితే కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీని అమరావతి గెలిపించలేకపోయింది. అంత హైప్ క్రియేట్ చేస్తే.. కనీసం ఆ రెండు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు రాలేదు. అమరావతి సరిహద్దుల్లోనే తన తనయుడిని మంగళగిరి నుంచి పోటీ చేయించి కూడా చంద్రబాబు నాయుడు చేతులు కాల్చుకున్నారు. అయితే అంత దారుణ పరాజయం ఎదురైనా, అమరావతి హైపును రాష్ట్రం మొత్తం తిరస్కరించినా.. చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్టుగా లేదు.
వయసు మీద పడిందా? మతి మందమైందా!
చంద్రబాబు అమరావతి విషయంలో సాగిస్తున్న హైడ్రామాను చూస్తే వచ్చే డౌటు ఇది. అధికారం చేతిలో ఉండి, అనవిగాని గ్రాఫిక్స్ ను చూపిస్తేనే.. అమరావతి డ్రామాను ప్రజలు విశ్వసించలేదు. అలాంటిది అమరావతి చంద్రబాబు చేసిన విఫల ప్రయోగం అని తేలిపోయాకా.. ఇంకా అమరావతి పేరు చెప్పి రాజకీయం చేయాలనుకోవడం చంద్రబాబు ఫెయిల్యూర్ స్టోరీలోని మరో అంకం.
అక్కడ చంద్రబాబు సంబంధీకుల రియలెస్టేట్ పెట్టుబడులే ఉన్నాయా, లేక తమ సామాజికవర్గం శక్తి పెంచుకోవడానికి అమరావతి మాత్రమే ఉపకరిస్తుందని బాబు భావిస్తున్నారా అనేది లెక్క బయటకు తెలియకపోవచ్చు కానీ, అమరావతితో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలెవరూ భావోద్వేగ పూరిత బంధాన్ని పెన వేసుకోలేదని స్పష్టం అవుతూనే ఉంది. ఆరు వందల రోజుల పాటు నిరసన ప్రదర్శన దీక్షలు చేసినా, ఆరువందల కిలోమీటర్ల పాదయాత్రను సాగించినా, ఇంకేం చేసినా…. అమరావతి కేవలం ఆ మూడూళ్ల సమస్య తప్ప, ముప్పై గ్రామాల సమస్య కూడా కాదు. ఇన్నాళ్లు ఎక్కని ఈ భావోద్వేగం తో .. ఇంకా రాజకీయ ఆటలు సాగించాలని చంద్రబాబే కాదు, పవన్ కల్యాణ్, బీజేపీలు అనుకున్నా.. ఆ మూడూళ్ల అవతల అంతా ఎదురయ్యేది భంగపాటే తప్ప.. మరోటి కాదు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలూ క్లారిటీ ఇవ్వేలదా?
వాస్తవానికి అమరావతి సెంటిమెంటును రగల్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాల్లో ఇది మొదటిదీ కాదు, బహుశా చివరిదీ కాకపోవచ్చు. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు అమరావతిని అడ్డం పెట్టుకునే రాజకీయం చాలా చేశారు. భిక్షటనలు అయ్యాయి, చంద్రబాబు గారి భార్య గాజుల విరాళం సొమ్మూ ఖర్చయిపోయి ఉంటుంది. మరి అప్పుడంతా రాని భావోద్వేగం ఇప్పుడెలా వస్తుంది? అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు గుంటూరు, విజయవాడల్లో.. వాడవాడా అమరావతి జపమే చేశారు.
అమరావతి పోరాటానికి గుంటూరోళ్లు, కృష్ణా జిల్లా వాళ్లు ఇంటికి ఒకరు ఎందుకు రారు? అంటూ నిలదీశారు. అమరావతితో బాగా లబ్ధి పొందేది ఆ జిల్లాలే అని చంద్రబాబు లెక్కేశారు. రీయలెస్టేట్ వ్యాపారి తరహాలో.. మాట్లాడారు. ప్రజలను నిలదీయడమే కాదు.. విజయవాడ, గుంటూరుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనుక విజయం సాధిస్తే.. అమరావతిని రాసిచ్చేసినట్టే అంటూ కూడా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. అయితే.. చంద్రబాబు అలా చెప్పినా, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది.
తద్వారా అమరావతి విషయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల రిఫరండం కూడా పూర్తయ్యింది. ఆ కార్పొరేషన్ల ఎన్నికలను అమరావతికి రిఫరండంగా మార్చింది చంద్రబాబే. ఆ రిఫరండంలో చంద్రబాబు వాదనను ఆ జిల్లాల ప్రజలే తిరస్కరించారు. ఎవరైతే అమరావతి వల్ల బాగా రియలెస్టేట్ ప్రయోజనాలు పొందుతారో వారో.. తిరస్కరించాకా.. ఇక ఇతర ప్రాంతాలు అమరావతికి మద్దతును ఇస్తున్నాయి, రాయలసీమలో నీరాజనాలు, కర్ణాటకలోని తెలుగు వారు విరాళాలు ఇచ్చారు.. అంటూ ఈ కథలు కామెడీ గాక మరేమవుతాయి?
రాయలసీమను రెచ్చగొట్టి సాధించేదేముంది?
చంద్రబాబు నాయుడు ఎన్ని ఆటలు ఆడినా.. రాయలసీమలో టీడీపీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు మిగిలే ఉంది. దాన్ని పెంపొందించుకుంటే.. టీడీపీకి ఇక్కడ ఇంకా రాజకీయ భవిష్యత్తు మిగిలే ఉండవచ్చు. బీసీల ఓటు బ్యాంకులో కొంత శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ మాత్రం పడని వారు, బలిజల్లో ఎక్కువ శాతం ఓట్లు టీడీపీకి రాసి పెట్టే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటివారిని కూడా దూరం చేసుకునే ప్రయత్నం టీడీపీ దిగ్విజయంగా మొదలుపెట్టింది.
రాయలసీమలో అమరావతికి మద్దతు అనే వారంతా టీడీపీ మనుషులే. అయితే టీడీపీ మనుషులంతా మాత్రం ఈ మాట మాట్లాడరు. మాట్లాడలేరు. టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకులో కూడా ఎంతో కొంత శాతం రాయలసీమలో ఏదైనా ఉండాలి, రాయలసీమకు న్యాయంగా దక్కాల్సినవైనా దక్కాలి.. అనే భావన ఉంది. అయితే చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలతో అయితేనేం.. అమరావతి భ్రమలతో అయితేనేం.. ఆ ఓటు బ్యాంకులో కూడా ఈ సారి కొంత చీలిక తప్పేలా లేదు. అమరావతి అజెండాతో.. వెళితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఓట్లు పడలేదు. అలాంటిది సీమలో ఇలా రెచ్చగొడితే జరిగేది ఏమిటి? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అంచాన వేయలేకపోతోందా? లేక అంచనా వేసి కూడా తెలియనట్టుగా ఉందా!
తోకకు నిప్పు పెట్టుకుంటున్న తమ్ముళ్లు!
వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీమకు ఉద్ధరించింది ఏమీ లేదు. అడుగడుగునా దగా చేసే తప్ప మరో ఊసే లేదు. రాయలసీమను చేసిన నిర్లక్ష్యానికి ప్రతిఫలమే గత ఎన్నికల్లో దక్కిన మూడు ఎమ్మెల్యే సీట్లు. ఆ మూడు కూడా ఆయన పరువునే నిలిపాయి. ఆయన తనయుడిని అమరావతి ప్రాంతం ఎమ్మెల్యేగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే, రాయలసీమ మాత్రం చంద్రబాబును, బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది.
ఇలా చూస్తే అమరావతి ప్రాంతం మీద కన్నా.. చంద్రబాబు నాయుడు సీమ మీదే ఇప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి. అయితే.. చంద్రబాబు మార్కు ఫెయిల్యూర్ వ్యూహాలతో ముందుకు వెళుతున్న టీడీపీ దీన్నేదీ అర్థం చేసుకునే స్థితిలో కనిపించడం లేదు. చంద్రబాబును నమ్మి.. అమరావతికి హారతులు పడుతున్న తెలుగు తమ్ముళ్ల తీరును గమనిస్తే.. వారు తమ తోకకు నిప్పు పెట్టుకుంటున్నారని అనిపించకమానదు. చంద్రబాబు వయసు 70 దాటింది. ఆయనే చెప్పినట్టుగా ఆయనకు ఇంకే పదవులూ అక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తిరస్కరణ ఎదురైతే ఆయన ఎంచక్కా ఇంట్లో కూర్చుని మనవడితో కాలక్షేపం చేసుకుంటారు.
అందులో సందేహాలు ఎవరికీ ఉండకపోవచ్చు. అయితే .. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆయన తీరును నమ్ముకుని గోదారి ఈదాలని టీడీపీ నేతలు భావిస్తే మాత్రం నష్టం వ్యక్తిగతం వారికే! అటు సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తున్న వారిగా మిగిలిపోతారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలతో పాటే వారు కూడా అడ్రస్ లేకుండా పోతారని వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు జై అమరావతి అంటే.. సీమ నేతలు చంద్రబాబుకు ఆనందాన్ని కలిగించవచ్చు. మనుషులను పెట్టి సీమలో జై అమరావతి అనిపిస్తే.. పచ్చ మీడియాలో వారికి పతాక స్థాయి ప్రాధాన్యత దక్కవచ్చు. అయితే సీమ ప్రజల మనుసుల్లో మాత్రం శాశ్వతంగా ద్రోహులుగా మిగిలిపోతారు. ఇందులో మాత్రం సందేహం లేదు. టీడీపీ నేతల్లో కూడా ఈ పాటికి ఈ చర్చ మొదలయ్యే ఉంటుంది. అమరావతి ఉద్యమం వారికి పీడకలగా, రాజకీయ జీవితాలకు చరమగీతం పాడేదిలా పరిణమించినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.