ప్రపంచ అందగత్తె, బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇది బాలీవుడ్‌తో పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్యరాయ్ , ఆ తర్వాత సినీ సెలబ్రిటీగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. 2009లో పద్మశ్రీ పురస్కారంతో ఆమెను భారత ప్రభుత్వం సత్కరించింది.
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి పెద్దింటి కోడలిగా తన కంటూ ప్రత్యేక సోషల్ స్టేటస్‌ను పొందారామె. తాజాగా ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అది కూడా సినీ రంగానికి సంబంధం లేని అంశాల్లో కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన పనాబా పేపర్ల లీకేజీపై ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
విచారణ నిమిత్తం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి ఇవాళ రావాలని ఈడీ ఆదేశించింది. అయితే గతంలో జారీ చేసిన సమన్లపై కొంత సమయం కావాలని ఐశ్వర్యరాయ్ వాయిదా కోరారని సమాచారం. అయితే ఇప్పుడైనా హాజరవుతారా లేక మరోసారి వాయిదా కోరుతారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తమ అక్రమ సంపాదనను రహస్య ఖాతాల్లోకి మళ్లించడానికి సాయం చేశారనే బాగోతం 2016లో బయటపడింది. ఇందులో ఐశ్వర్యరాయ్ కూడా ఉండడం గమనార్హం.