కలర్స్ స్వాతి వెండితెరకి పరిచయమై చాలా కాలమవుతున్నా కానీ ఇంతవరకు ఆమె కెరీర్లో ఎదుగు బొదుగు లేదు. కొన్ని మంచి చిత్రాల్లో నటించి, నటిగా పేరు తెచ్చుకున్నా కానీ స్వాతి రేంజ్ ఏమాత్రం పెరగలేదు. అయితే ఈమధ్య ఆమెకి కొన్ని మంచి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.
గత ఏడాది స్వామిరారాతో హిట్ కొట్టిన స్వాతి త్వరలో విడుదల కాబోతున్న కార్తికేయపై హోప్స్ పెట్టుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోను ఆమెకి కొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. పంజా దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్లో స్వాతి ఓ చిత్రం చేస్తోంది.
ఆర్య హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మరో హీరో కృష్ణన్ సరసన స్వాతి నటిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన తమిళ చిత్రం తెలుగులోకి కుల్ఫీ పేరుతో అనువాదమైంది. భారీ హిట్లు ఏమీ సాధించకపోయినా కానీ ఆఫర్లయితే వస్తున్నాయి కాబట్టి స్వాతి బిజీగానే ఉంటోంది.