రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు పాలనకు నెల రోజులు పూర్తయ్యింది. చంద్రబాబు నెల రోజుల పాలన పట్ల సీమాంధ్ర ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ సర్కారు తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు.
గత నెల ఇదే రోజున చంద్రబాబు ఏపీ తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్త రాజధాని మొదలుకొన్ని అన్నిటినీ పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అయితే సమైక్య రాష్ట్రానికి తొమ్మిదేళ్లు పనిచేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో నవ్యాంధ్ర నిర్మాణానికి ఆయన అనుభవం అక్కరకు వస్తుందని అందరూ భావించారు. ప్రజలు బెస్ట్ ఆప్షన్నే ఎంచుకున్నారని ఎన్నికల ఫలితాల అనంతరం మేధావివర్గం కూడా అభిప్రాయపడింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి పోటీ చేసిన బీజేపీయే కేంద్రంలోనూ అధికారపగ్గాలు చేపట్టడంతో ముందన్నది మంచికాలమేనని సీమాంధ్ర ప్రజలు భావించారు.
వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతిలో ఉన్నా ఫర్యాలేదన్నది నానుడి. అయితే కూటమి ప్రభుత్వమే కేంద్రం పీఠంపై ఉన్నప్పటికీ…కేంద్రం నుంచి రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పటి వరకు ఉచిత హామీలు తప్ప నిర్ధిష్టంగా ఏమీ సాధించలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీని సాధించడంలో విఫలం చెందారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించలేమన్న ప్రణాళిక సంఘం అభిప్రాయం..సీమాంధ్రులను తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి గురిచేసే అంశం. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదాపై స్పందించిన ఓ కేంద్ర మంత్రి…కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే…ఏ రాష్ట్రంపైనా అవాజ్య ప్రేమ చూపబోదని సెలవిచ్చారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీని సాధించకపోవడం బాబు సర్కారు పట్ల ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.
అటు ఏపీకి కొత్త రాజధాని విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వచ్చే అవకాశం ఉందని చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు బహిరంగ ప్రకటనలే చేశారు. మంగళగిరి వద్ద కొత్త రాజధాని రావచ్చని ప్రచారం జరిగినా…అమరావతి పేరు వారం క్రితమే తెరమీదకు వచ్చింది. అటు రాయలసీమకు చెందిన మంత్రులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు కొత్త రాజధాని విషయం తమ గళం పెంచుతున్నారు. వెనుకబడిన రాయలసీమలోనే కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఎంపిక కోసం గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలు నుంచే క్షేత్రస్థాయి పరిశీలనలను చేపట్టకపోవడం పట్ల శివరామకృష్ణన్ కమిటీని నిలదీశారు. కొత్త రాజధానిపై వస్తున్న ఊహాగానాలతో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొత్త రాజధాని విషయంలో వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఇక ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. రుణమాఫీ, ఫెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర హామీలపై సందిగ్థత కొనసాగుతోంది. రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుంది? ఏ రుణాలకు వర్తిస్తుంది? ఎంత సొమ్ము వరకు వర్తిస్తుంది? అన్న అంశాల్లో చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు వినతికి ఆర్బీఐ గవర్లర్ రఘురాం రాజన్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రులు ప్రకటించినా…సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో…రుణమాఫీ రాష్ట్రానికి సంబంధించిన అంశమంటూ కేంద్రం చేతులెత్తేయడం రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ హామీలను బేఖాతరు చేస్తూ రుణాలను తిరిగి చెల్లించాలంటే రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్త్తూనే ఉన్నాయి. ఆర్బీఐ నుంచి ఆదేశాలు ఇప్పించే వరకు రుణాల వసూలు విషయంలో తమ చర్యలను నిలుపుదల చేసే ప్రసక్తే లేదని బ్యాంకర్లు ఇప్పటికే ఏపీ సర్కారుకు తేల్చి చెప్పారు.
పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డ చందంగా నిత్యవసర సరకుల ధరలు మరింత పెరగడం బాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచే అంశం. రైల్వే ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచినా…దీన్ని టీడీపీ బలంగా వ్యతిరేకించకపోవడాన్ని సామన్య ప్రజలు గమినిస్తూనే ఉన్నారు. పెరుగుతున్న సిమెంట్ ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని నిలదీస్తున్నారు.
అటు కొత్త రాష్ట్రం…కొత్త ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతకూ నిరాశే ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవం, కనీసం త్వరలో ఉద్యోగ నియామకాలు చేపడుతామని ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటనలు చేయకపోవడం నిరుద్యోగ యువతలో అసహనం కలిగిస్తోంది. కొత్త పరిశ్రమలను పక్క రాష్ట్రాలు గద్దల్లా తన్నుకు పోకుండా చంద్రబాబు చాణక్యత ప్రదర్శించాలని నిరుద్యోగ యువకులు కోరుతున్నారు.
నెల రోజుల చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్న ప్రజలు, నిపుణులు…నవ్యాంధ్ర నిర్మాణానికి టీడీపీ సర్కారు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలు మొక్కుబడిగా సాగకుండా…ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన హామీలను కేంద్రం నుంచి సాధించాలని కోరుకుంటున్నారు.
(రచయిత-పాత్రికేయులు వేలూరు జనార్దన్)